సుంకాల జాబితా నుండి పప్పుధాన్యాలు తొలగింపు

సుంకాల జాబితా నుండి పప్పుధాన్యాలు తొలగింపు
న్యూఢిల్లీకి పెద్ద దౌత్య విజయంగా, భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తర్వాత విడుదల చేసిన తన ఫ్యాక్ట్ షీట్‌ను వైట్ హౌస్ సవరించింది. గతంలో, భారతదేశం సుంకాలను తొలగిస్తుందని లేదా తగ్గిస్తుందని చెప్పిన అమెరికన్ ఉత్పత్తుల జాబితాలో పప్పుధాన్యాలు ప్రస్తావించగా, ఈ ఉత్పత్తిని ఇప్పుడు తొలగించారు. అలాగే భారత్‌కు సంబంధించిన ఒక కీలక పదాన్ని కూడా మార్చింది. ఈ మేరకు తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై సవరించిన ‘ఫాక్ట్ షీట్’ను విడుదల చేసింది.
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఉండనున్న కీలక వివరాలతో వైట్‌హౌస్ సోమవారం అర్ధరాత్రి ఒక ఫ్యాక్ట్ షీట్‌ను విడుదల చేసింది.  అందులో భారత్ కొన్ని రకాల పప్పుధాన్యాలపై సుంకాలను తగ్గిస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. ఆ తర్వాత మంగళవారం విడుదల చేసిన సవరించిన నివేదికలో ప్రస్తావినను తొలగించింది. నట్స్, సోయాబీన్ ఆయిల్, వైన్ వంటి జాబితా నుంచి పప్పుధాన్యాలను తొలగించింది. 

అలాగే గతంలో భారత్ అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంది అని పేర్కొంది. తాజగా నివేదికలో కట్టబడి బదులుగా కొనుగోలు చేసే ఉద్దేశంతో అన్నట్లుగా మార్పులు చేసింది. అమెరికాకు చెందిన పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు, డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్, జొన్నలు, డ్రై ఫ్రూట్స్, సోయాబీన్ ఆయిల్, వైన్ వంటి వాటిపై భారత్ సుంకాలను తగ్గించనుందని పేర్కొంది. 

రాబోయే ఐదేళ్లలో సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఇంధనం, ఐటీ, బొగ్గు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోందని తెలిపింది. గత వారం వెలువడిన ఉమ్మడి ప్రకటనలో కూడా పప్పుధాన్యాల ప్రస్తావన లేదు. వైట్ హౌస్ తన తాజా సవరణ ద్వారా ఆ ప్రకటనకు అనుగుణంగా మార్పులు చేసినట్లు కనిపిస్తోంది.

మన దేశానికి అగ్రరాజ్యం ఎగుమతి చేసే వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు మొదట నుంచే భారత్​ అంగీకరించడం లేదు. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ వల్ల భారత రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి నష్టం ఉండదని ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖమంత్రి పీయూష్ గోయల్‌ స్పష్టం చేశారు.  ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్‌షీట్‌లో సవరణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా, భారత్​- అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కింద దేశానికి అత్యంత సున్నితమైన అన్ని కీలక రంగాలను పూర్తిగా రక్షించిందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందాల్లో భారత్ ఎప్పుడూ స్పష్టమైన దృక్పథంతోనే చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు, పాడి రంగంపై ప్రభావం పడే అంశాల్లో రాజీపడలేదని ఆయన తెలిపారు. అలాగే, ఈ సంయుక్త ప్రకటనను చట్టబద్ధ ఒప్పందంగా మార్చేందుకు రెండు దేశాల బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. 

మార్చి చివరికల్లా తుది ఒప్పందం సిద్ధమై సంతకం చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విలేకర్లతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. “భారత్ ఎప్పుడూ స్పష్టమైన దృక్పథంతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల జీవనోపాధికి హాని కలిగించే ఏ రంగాన్నైనా తెరిచే ప్రసక్తే లేదు. ఇది మా భాగస్వామ్య దేశాలకు కూడా స్పష్టంగా చెప్పాం” అని తెలిపారు. 

“గత ఏడాది భారత్ కుదుర్చుకున్న ఐదు వాణిజ్య ఒప్పందాల్లోనూ అన్ని సున్నిత రంగాలు సురక్షితమే. అమెరికాతో ఒప్పందంలోనూ ఇదే విధానం అమలైంది. ఎక్కడైనా స్వల్ప సున్నితత్వం ఉంటే, టారిఫ్ రేట్ కోటా (టీఆర్​క్యూ) విధానాన్ని ఉపయోగించి మార్కెట్ ప్రాప్యతను పరిమితం చేశాం. తద్వారా మన రైతులకు నష్టం జరగకుండా చూశాం” అని రాజేశ్ అగర్వాల్ తెలిపారు.