రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి

రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. వీటితో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా  ముఖ్యమంత్రి మంగళవారం కేంద్ర హోం మంత్రి సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. 
 
అమిత్ షాతో సహా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన సీఎం పూర్వోదయ పథకం ద్వారా రాయలసీమను ఉద్యాన హబ్ గా మార్చే ప్రణాళికకు నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర వాటాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని అభ్యర్ధించారు.
మఖానా సాగుకు ఏపీలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. కొల్లేరు ప్రాంతంలో 50వేల ఎకరాల్లో మఖానా సాగు చేసేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు.  పీఎం ప్రణామ్ పథకం కింద ఏపీలో సామూహిక సహజ వ్యవసాయాన్ని విస్తరించేందుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని  కోరారు. ఈ పథకం కింద గత ఏడాది రసాయన ఎరువుల వాడకం తగ్గించిన రాష్ట్రంగా ఏపీకి రూ.216 కోట్ల మేర ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని అడిగారు. 
 
ఏపీలో కొబ్బరి సాగు చేసేందుకు రూ. 200 కోట్ల మేర సాయం అందించాలని కూడా సీఎం కోరారు. వన్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద పెండింగ్ లో ఉన్న రూ.695 కోట్లను విడుదల చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు.  పోలవరం ప్రాజెక్టు రెండో దశలో భాగంగా తదుపరి భూసేకరణ, పునరావాసానికి నిధులు రూ. 32,000 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్సు చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు.  గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేయాలని అభ్యర్ధించారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించేలా వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్‌లో ప్రచురించాలని కోరారు.

ఉత్తర- దక్షిణ భారత్ ను అనుసంధానిస్తూ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర- దక్షిణ భారత్ కలిపేలా ఇటార్సీ- విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని.. పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్ పూర్- చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు.

 
విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్ధించారు. రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను కనెక్టు చేసేలా వివిధ కొత్త రైల్వేమార్గాల ప్రతిపాదనల్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్- శ్రీశైలం- మార్కాపురం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలని, తిరుపతి మీదుగా విజయవాడ-బెంగుళూరు మధ్య వందేభారత్ సర్వీసును నడపాలని కోరారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద రూ. 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. కేంద్ర వాటా కింద రూ. 105 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్ ‌డీ కుమారస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.