అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు ఓం బిర్లా గైరాజర్!

అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు ఓం బిర్లా గైరాజర్!

తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన అవిశ్వాస నోటీసు పరిష్కారం అయ్యే వరకు సభా కార్యక్రమాలకు హాజరుకావద్దని ఓం బిర్లా నైతిక కారణాలపై నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విపక్షాలు ఈ ఉదయం లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు సమర్పించాయి. లోక్‌సభ నియమావళి 94సి ప్రకారం ఈ నోటీసును మధ్యాహ్నం 1:14 గంటలకు సమర్పించినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. మొత్తం 118 మంది ఎంపీలు ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తనపై వచ్చిన అవిశ్వాస నోటీసును పరిశీలించాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. నోటీసును నియమావళి ప్రకారం అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని లోక్‌సభ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ అంశంపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.

స్పీకర్ ఓం బిర్లా వ్యవహారశైలిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సభను ఆయన పక్షపాత ధోరణితో నడుపుతున్నారని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు కూడా అనుమతి నిరాకరించారని తెలిపారు.

ఇక ఈ పరిణామాలపై అధికార పార్టీ బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర మాట్లాడుతూ, “సభ నియమాలను పాటించకుండా వ్యవహరించే కాంగ్రెస్‌కు స్పీకర్‌పై అవిశ్వాసం చెప్పే నైతిక హక్కు లేదు” అని విమర్శించారు. గతంలో తమిళనాడుకు చెందిన ఒక న్యాయమూర్తిపై కాంగ్రెస్ ఇంపీచ్‌మెంట్ ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీపం కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు.