పిల్లల అదృశ్యం వెనుక జాతీయ స్థాయిలో నెట్‌వర్క్‌?

పిల్లల అదృశ్యం వెనుక జాతీయ స్థాయిలో నెట్‌వర్క్‌?
దేశంలో పలు ప్రాంతాల్లో పిల్లలు అదృశ్యమవుతున్న సంఘటనల వెనుక ఏదైనా జాతీయ స్థాయిలో నెట్‌వర్క్‌గానీ లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన గ్రూపుల ప్రమేయం గానీ వుందో లేదో నిర్ధారించాల్సిందిగా సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని కోరింది. ఈ సంఘటనల వెనుక ఒకే రకమైన ధోరణి కనిపిస్తోందా లేక ఇవన్నీ వేటికవి జరిగినవేనా అని తేల్చుకోవాల్సిన అవసరం వుందని జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది. 
 
ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల నుండి డేటాను సేకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భటి మాట్లాడుతూ, అదృశ్యమైన పిల్లలకు సంబంధించిన డేటాను, వాటి ప్రాసిక్యూషన్‌ వివరాలను కొన్ని రాష్ట్రాలు ఇచ్చాయని కానీ దాదాపు 12 రాష్ట్రాల నుండి మాత్రం ఎలాంటి డేటా అందలేదని తెలిపింది. కేంద్రం పూర్తి డేటాను అందచేసిన తర్వాత మాత్రమే విశ్లేషణ జరుగుతుందని ఆమె చెప్పారు. 
 
అదృశ్యమైన పిల్లలను కాపాడిన తర్వాత వారిని ఇంటర్వ్యూచేసి దీని వెనుక ఎవరు వున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలని సుప్రీం సూచించింది. డేటాను అందచేయని రాష్ట్రాల వైఖరిని బెంచ్‌ తీవ్రంగా విమర్శించింది. అవసరమైతే కఠిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. కేంద్రం చొరవ తీసుకుని, డేటాను అందచేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని సీనియర్‌ న్యాయవాది అపర్ణ భట్‌ కోరారు. 
 
ఇలా అదృశ్యమైన పిల్లల ఆచూకీ తెలియని సంఘటనలు పెరుగుతున్నాయంటూ ఒక ఎన్‌జిఓ దాఖలు చేసిన పిల్‌ను విచారిస్తూ బెంచ్‌ పై వ్యాఖ్యలు చేసింది. గతేడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో కూడా ఈ అంశంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. గల్లంతైన వారిపై ఆరేళ్ళ దేశవ్యాప్త డేటా అందచేయాలని కోరింది. రాష్ట్రాలతో, కేంద్ర పాలిత ప్రాంతాలతో మాట్లాడుతూ వారి నుండి డేటా సేకరించే విషయమై సమర్ధవంతమైన సమన్వయాన్ని చూపే అంకిత భావం కలిగిన అధికారిని ఇందుకోసం నియమించాలని కోరింది.