దేశంలో డిజిటల్ మోసాల ద్వారా రూ.54వేల కోట్లకు పైగా సొమ్ము దోపిడీకి గురికావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ “పచ్చి దోపిడీ, డెకాయిటీ” అని వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి, ఒక పక్కా ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్ఓపీ) రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం సుమోటోగా ఈ కేసు విచారణను చేపట్టింది. పెరుగుతున్న “డిజిటల్ అరెస్టుల” ముప్పును అరికట్టే ప్రయత్నంలో, సైబర్ నేర బాధితులకు వ్యవస్థాగత అంతరాలను తొలగించడానికి, నిజ-సమయ రక్షణను నిర్ధారించడానికి ఉన్నత స్థాయి అంతర్-విభాగ కమిటీ (ఐడిసి)ని ఏర్పాటు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
ఈ అంశంపై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మార్గదర్శకత్వంలో అంతర్-విభాగ మంత్రిత్వ సంప్రదింపులు జరపాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) అధ్యక్షతన అంతర్-విభాగ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌లో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగం , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుండి జాయింట్ సెక్రటరీ-స్థాయి అధికారులు ఉన్నారు.
ఈ కమిటీకి చట్టపరమైన అంతరాలను గుర్తించడం, దిద్దుబాటు చర్యలను సూచించడం మరియు బ్యాంకింగ్, టెలికాం రంగాలలో సమయానుకూల సమ్మతిని నిర్ధారించడం తప్పనిసరి. కోర్టు నియమించిన అమికస్ క్యూరీ చేసిన సిఫార్సులను గత ఏడాది డిసెంబర్ 1న జారీ చేసిన ఆదేశాలతో పాటు పరిగణనలోకి తీసుకోవాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.
“బ్యాంకులు కేవలం లాభాపేక్షతో, వ్యాపార ధోరణిలో ఉండి, నేరగాళ్లు సులభంగా దోపిడీ సొమ్మును తరలించడానికి వేదికలుగా మారుతున్నాయి” అని జస్టిస్ బాగ్చీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ మధ్య మన దేశంలో ఏకంగా రూ.52వేల కోట్ల సైబర్ మోసాలు జరిగినట్లు హోంశాఖ నివేదిక పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇది ‘అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువ మొత్తం’ అని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. ఈ డిజిటల్ మోసాలు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా నేరగాళ్లతో సహకరించడం వల్ల జరిగి ఉండవచ్చని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టుల పట్ల ఆర్‌బీఐ, బ్యాంకులు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.
ఆర్‌బీఐ, టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, ఈ నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి నాలుగు వారాల్లోగా ఒక ముసాయిదా ఒప్పందాన్ని సిద్ధం చేయాలని హోం మంత్రిత్వ శాఖను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులను గుర్తించాలని సీబీఐని ఆదేశించింది.ఈ కేసుల్లో విచారణ జరిపేందుకు సీబీఐకి అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.
కాగా, కోర్టు ఆదేశాల మేరకు, ఢిల్లీలో జరిగిన ఒక హై ప్రొఫైల్ మోసం కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిందని నివేదిక పేర్కొంది. నకిలీ పత్రాలను ఉపయోగించి నకిలీ వ్యక్తులతో కూడిన “డిజిటల్ అరెస్ట్” స్కామ్ ద్వారా 76 ఏళ్ల వితంతువు పెన్షనర్‌ను రూ. 1.64 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి మోసాలు తరచుగా వ్యవస్థీకృత, అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్‌ల ద్వారా జరుగుతాయని, అంతర్జాతీయ మాడ్యూళ్లను విచ్ఛిన్నం చేయడానికి ఏజెన్సీ ఇప్పుడు ఇంటర్‌పోల్ ఛానెల్‌లను ఉపయోగిస్తుందని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.
డిజిటల్ అరెస్ట్ బాధితులకు పరిహారం అందించే విషయంలో ఉదారంగా, ఆచరణాత్మక దృక్పథంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. పరిహారం చెల్లింపుపై ఒక ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేయడానికి ఆర్‌బీఐ, టెలికాం శాఖ సంయుక్తంగా సమావేశం కావాలని ఆదేశించింది. సైబర్ మోసాల నివారణలో బ్యాంకులు క్రియాశీలక పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
సైబర్-ఆధారిత మోసాలను నిరోధించడానికి డెబిట్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టేవిధంగా ఎస్‌ఒపిని ఆర్‌బిఐ రూపొందించిందని పేర్కొంది. “కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థల ఖాతాల్లో భారీ లావాదేవీలు జరిగితే అనుమానం రాకపోవచ్చు. కానీ కేవలం రూ.15-20 వేల పెన్షన్ తీసుకునే వ్యక్తి ఖాతా నుంచి ఒక్కసారిగా రూ.50 లక్షలు లేదా కోటి రూపాయలు విత్డ్రా అవుతుంటే, మీ ఏఐ టూల్స్ ఎందుకు అలర్ట్ చేయడం లేదు?” అని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నించారు.

More Stories
ఎప్స్టీన్ ఫైల్స్‌తో బ్రిటన్ ప్రధానికి గండం… తొలి ముస్లిం ప్రధాని?
భారీగా పెరుగుతున్న విమానాశ్రయాల యూజర్ చార్జీలు
మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంపై విస్తృత ప్రచారం.. కేసు నమోదు