తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, తెల్లాపూర్ గ్రామంలో పూలే విగ్రహం పై దాడి జరిగిన సంఘటనకు ఆర్‌ఎస్‌ఎస్ తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది. ఈ ఘటన పూర్తిగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య సాగిన ఆధిపత్య పోరు ఫలితమే. జనవరి 25న తెల్లాపూర్ గ్రామస్తులు అందరూ కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆ తర్వాత, ఫిబ్రవరి 6న ఒక కాంగ్రెస్ నాయకుడి నేతృత్వంలో మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని ప్రతిష్టించారు. మహాత్మా ఫులే విగ్రహ ఏర్పాటుపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవు. గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంతో, ఎంతో ఉత్సాహంగా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామంలోని వారు అందరూ కలిసి ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, ఈ మధ్యలో కొద్దిమంది అవకాశ వాదులు అయిన వ్యక్తులు వచ్చి పూలే విగ్రహాన్ని దెబ్బతీయడం జరిగిందని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.
అయితే, అదే రోజు కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఒక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చేరుకుని, ఇతర కులాలను దూషిస్తూ ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు అభ్యంతర పెట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఈ గొడవకు ఆర్‌ఎస్‌ఎస్‌తో ఏమాత్రం సంబంధం లేదు.
రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న అధికార పోరులో అన్యాయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందించే ప్రయత్నం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. ఇటువంటి దుశ్చర్యల కారణంగా గ్రామ ప్రజల్లో సామరస్య వాతావరణంను దెబ్బ తీసి గ్రామం లో ఉద్రిక్త వాతావరణంకు దారితీయడం దురదృష్టకరం. ఈ సంఘటనను ఆర్‌ఎస్‌ఎస్ కు ఆపాదించి, కావాలనే అప్రదిష్టపాలు చేసే ప్రయత్నం కొన్ని స్వార్ధపరశక్తులు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
రాజ్యాంగ నిర్మాతలు, దేశభక్తులు, సామాజిక సంస్కర్తల పట్ల ఆర్‌ఎస్‌ఎస్ ఎల్లప్పుడూ అత్యంత గౌరవ భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. సమాజంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యక్తుల పట్ల గ్రామ ప్రజలు, యువత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

More Stories
కుత్బుల్లాపూర్ లో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు పరుగులు
మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..ఎన్నిక రద్దు
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరపాలి