ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకిని అనుమతించం

ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకిని అనుమతించం
* సుప్రీంకోర్టులో మమతకు చుక్కెదురు
 
“ఏవైనా ఆదేశాలు లేదా స్పష్టత అవసరమైతే, మేము జారీ చేస్తాం… కానీ ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకిని మేము అనుమతించం. దీనిని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎవరూ అడ్డుకోవడానికి అనుమతించబోమని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు సహించబోమని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.  
 
ఎన్నికల కమిషన్ తరపున ఎస్ఐఆర్ విధుల్లో నిమగ్నమైన అధికారులపై బెదిరింపులు, హింసకు సంబంధించిన ఫిర్యాదులపై స్పందన కోరుతూ సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ డిజిపికి షో-కాజ్ నోటీసు జారీ చేసింది.కాగా, ఎస్ఐఆర్ ప్రక్రియకు గడువును రాష్ట్రంలో ఫిబ్రవరి 14 నుండి మరో వారం పాటు, 21 వరకు ధర్మాసనం పొడిగించింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానంపై ధర్మాసం విచారించింది. 1.36 కోట్ల మంది ఓటర్లు తార్కిక వ్యత్యాస జాబితాలో ఉన్నారని, ‘ఇంటిపేర్లలో అక్షరదోషాలు’ లేదా పెళ్లి తర్వాత మహిళల చిరునామాలలో మార్పు వంటి చిన్న చిన్న లోపాల ఆధారంగా వారి పేర్లు తొలగించారని మమతా ఆరోపించారు. 
 
గతవారం ఈ కేసులో ఆమె స్వయంగా తన వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. న్యాయం మూసిన తలుపుల చాటున దుఃఖిస్తుందని, తమకు ఎక్కడా న్యాయం జరగడం లేదని మమతా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.  అలాగే, 8,300 మంది మైక్రో-అబ్జర్వర్లుగా ఈసీ నియమించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఎటువంటి అధికారం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఓటరు జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగిస్తున్నారని దీదీ ఆరోపించారు.

మైక్రో అబ్జర్వర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తాము ఐదు లేఖలు రాసినా వారు స్పందించకపోవడంతో తామే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాల్సి వచ్చిందని ఈసీ తరఫున లాయర్ కోర్టుకు వివరించారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియకు అవసరమైన అధికారుల పేర్ల వివరాలను బెంగాల్ ప్రభుత్వం తమకు అందజేయలేదని ఆరోపించారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఎన్నికల సంఘం ఎప్పుడూ గ్రూప్-బి అధికారులను కోరలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అభ్యర్థన ఏదీ చేయలేదని తెలిపారు.

మమతా బెనర్జీ తరపున హాజరైన శ్యామ్ దివాన్ ఈసీ వాదనలను తిప్పికొడుతూ పేర్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిని ఎన్నికల కమిషన్‌కు పంపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ మేము ఫిబ్రవరి 4న ఆదేశాలు ఇస్తే ఫిబ్రవరి 7న ఉదయం 12 గంటల వరకూ ఎందుకు పంపలేదని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మైక్రో-అబ్జర్వర్ల స్థానంలో 8,000లకుపైగా గ్రూప్ బి అధికారుల పేర్లను పంపడంలో ఎందుకు జాప్యం జరిగింది’ అని సీజేఐ నిలదీశారు.