మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..ఎన్నిక రద్దు

మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..ఎన్నిక రద్దు
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 6వ వార్డు చందపూరులో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారు. 6వ వార్డు నుంచి గెలుపొందేందుకు మహదేవప్పకు ఎక్కువ అవకాశాలుండటంతో ఇతర పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేయడంతో భయబ్రాంతులకు లోనై ఉరి వేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా ఆరో వార్డు ఎన్నిక రద్దు చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముక్తాల్ వెళ్లి ఆయన కుటుంభం సభ్యులను పరామర్శించిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులు, వేధింపులే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తామని ఆయన ధీమాగా ఉన్నారని, కానీ అధికార పార్టీ నాయకులు తమను వేధిస్తూ, బెదిరిస్తూ భయపెడుతున్నారని మహాదేవప్ప భార్య స్పష్టంగా చెప్పారని తెలిపారు. మహాదేవప్ప గారి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

బీజేపీ ఎంపీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ కూడా మహదేవప్ప కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. మహదేవప్ప ఆత్మహత్య ఘటనను రాజ్యసభలో ప్రస్తావించినట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? అని హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌పై యుద్ధం చేయబోతున్నట్లు ప్రకటించారు.  

 
కాగా, మక్తల్​లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
ఈ తోపులాటలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. పలువురు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందని డీజీపీ శివధర్​ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మహదేవప్ప ఎటువంటి ఆత్మహత్య లేఖ రాయలేదని తెలిసిందని చెప్పారు.
మహాదేవప్ప భార్య చెప్పిన విషయాలు ఇప్పటికే వార్తల్లో కూడా వచ్చాయని, అయినప్పటికీ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్‌ను మార్చివేశారని తెలుస్తున్నట్లు రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాదేవప్ప గారి భార్యకు చదవురాదని, అయినప్పటికీ ఆమెతో సంతకం చేయించుకుని, ఆమెకు తెలియకుండా వివరాలను మార్చి తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన ఆరోపించారు. పోలీసులు చట్టపరంగా వ్యవహరించకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.