కుత్బుల్లాపూర్ లో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు పరుగులు

కుత్బుల్లాపూర్ లో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు పరుగులు

హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజులరామారం మెట్‌ఖాన్‌గూడ ప్రాంతంలో ఉదయం 10:10 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. గాజుల రామారం, మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10.17 ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు పేర్కొన్నారు.

 భారీ శబ్దంతో పాటు ప్రకంపనలు రావడంతో అపార్టుమెంట్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.  ఒక నిమిషం పాటు భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని, పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల నుండి భయంతో బయటికి పరుగులు తీశామని వివరించారు.  కాగా, భూకంపం సంభవించినట్లు అధికారులు నిర్ధారించలేదు.

ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా? లేదా ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిందా అనే అంశంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.  చాలా మందికి భూకంపమే జరిగిందన్న అనుమానం కలిగింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న సీసీ కెమెరాల్లో భూమి కంపించినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి.

స్థానికులు మాట్లాడుతూ, ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి ఇళ్లంతా ఊగినట్లు అనిపించిందన్నారు. భయం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారిక నిర్ధారణ కోసం పరిశీలనలు కొనసాగుతున్నాయి. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖలు ఘటన స్థలానికి చేరుకున్నారు. భద్రతా చర్యల భాగంగా స్థానికంగా ఉన్న ఒక పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సెలవు ప్రకటించింది. 

ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భూకంపాలపై మరింత సమాచారం తెలుసుకోవడానికి నిపుణుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.