ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న సిమిలిపాల్ జాతీయ ఉద్యానవనం మరోసారి తన జీవ వైవిధ్యంతో వార్తల్లో నిలిచింది. బరిఫడాలోని మహారాజా శ్రీరామ్ చంద్ర భంజా దేవ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బిస్వజిత్ రాథ్ నేతృత్వంలో నిర్వహించిన విస్తృత పరిశోధనలో 148 లైకెన్ జాతులను గుర్తించగా, వాటిలో కొన్ని అత్యంత అరుదైనవిగా తేలాయి.
ఫిసియెల్లా మెలనోక్రోమా అనే జాతిని దేశంలో తొలిసారిగా గుర్తించారు. క్లాడోనియా ఫ్రూటికులోసా అనే జాతి ఒడిశాలో మొదటిసారి నమోదు కావడం విశేషం. లైకెన్లు అనేవి శిలీంధ్రం (ఫంగస్), శైవలాలు లేదా నీలి బ్యాక్టీరియా కలిసిన సహజ జీవ సమూహాలు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవించగలవు. తమను రక్షించుకోవడానికి ఇవి ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.
పరిశోధనలో సేకరించిన లైకెన్లలో థైమోక్వినోన్, జియోరిన్, అజెలాయిక్ ఆమ్లం వంటి విలువైన జీవక్రియ పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించే క్రిమి నాశక గుణాలు, శరీర కణాలను రక్షించే ఆక్సీకరణ నిరోధక లక్షణాలు, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే వ్యాధి నిరోధక ప్రభావం కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రొఫెసర్ బిస్వజిత్ రాథ్ మాట్లాడుతూ ఇక్కడి లైకెన్లలో ఉన్న థైమోక్వినోన్ వంటి పదార్థాలు మనుషుల్లో వ్యాధికారక జీవులను నిర్మూలించగలవన్నారు. క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

More Stories
ఢిల్లీలో సినిమా ప్రచారం కోసం `తప్పిపోతున్న అమ్మాయిలు’ ప్రకటనలు
గడ్చిరోలి జిల్లాలో ముగ్గురు నక్సలైట్లు హతం
ఉప ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కుకీ గ్రూపులు మణిపూర్ బంద్