ఉగ్రవాదం విషయంలో భారత్ రాజీపడబోదని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, జాతీయ భద్రత, సెమీ కండక్టర్లు, వాణిజ్యం సహా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌కు మలేషియాతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. సంపన్న మలేసియా, వికసిత భారత్‌ను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇరు దేశాలు విభిన్న రంగాల్లో సంబంధాలను మరింత శక్తిమంతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదంపై తమ సందేశం స్పష్టంగా ఉందని అన్నారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరికి, రాజీ వైఖరికి తావులేదని స్పష్టంచేశారు. భారత్-మలేషియా దేశాలు సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయని, ఇరుదేశాల ప్రజల మధ్య లోతైన ఆత్మీయ బంధం ఉన్నదని ప్రధాని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి వృద్ధి యంత్రంగా మారిందని పేర్కొన్నారు.
భారత్-మలేషియా మధ్య ఆరు కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రక్షణ మరియు భద్రత, సెమీకండక్టర్, వాణిజ్య రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేడు మలేషియా భారతీయ సంతతికి చెందిన జనాభాతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా ఉందని, మన నాగరికతలు, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు ఒకదానితో ఒకటి ముడివేసుకుని ఉన్నాయని చెప్పారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, నిఘా భాగస్వామ్యం సముద్ర, భద్రతలో ఇరు దేశాలు సహకారాన్ని బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధి చోదకంగా అభివృద్ధి చెందుతోందని చెబుతూ ఆసియాన్‌తో కలిసి మొత్తం ఇండో -పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి, స్థిరత్వానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు.
వాణిజ్యం, పెట్టుబడి, మలేషియా సహకారాన్ని విస్తరిస్తున్నామని మలేషియా ప్రధాని ఇబ్రహీం తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థికరగంలో భారతదేశం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందని పేర్కొన్నారు. డిజిటల్ ఎకానమీ, బయోటెక్, ఐటీ విభాగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని చెప్పారు. మలేసియా, భారత్ ప్రజల మధ్య సంబంధాలు సైతం మరింత మెరుగయ్యాయని, ఫలితంగా ఇరుదేశాల్లో పర్యాటక రంగానికి ఊతం లభించిందని పేర్కొన్నారు. ఈ విజయాల స్ఫూర్తితో మలేసియా, భారత్ భాగస్వామ్యాన్ని మునుపెన్నడూ లేనంత వేగంతో బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలిపారు.
“భారత్ మాకు మంచి మిత్రదేశం. ప్రధాని మోదీ మా దేశ పర్యటనకు వచ్చినందుకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషం కలిగింది. నేను, ప్రధాని మోదీ ప్రైవేటుగా కొన్ని సున్నితమైన ద్వైపాక్షిక అంశాలపై చర్చించాం. వాటిపై మా అధికార వర్గాలు ప్రకటన చేస్తాయి. మేం భారత్‌తో అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ అవకాశాల కోసం మలేషియా ఆసక్తిగా ఎదురు చూస్తోంది” అని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం తెలిపారు.

More Stories
ఆదర్శంగా నిలబడితేనే ప్రపంచంకు భారత్ మార్గదర్శకత్వం
తాజా అమెరికా మ్యాప్ లో భారత్ లో పిఓకె, ఆక్సాయ్ చిన్
రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులపై కత్తితో దాడి