భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా పోషించే పాత్ర కేవలం మాటల వల్ల కాకుండా, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే ప్రవర్తన ద్వారానే ఆవిర్భవిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ముంబైలో “సంఘ్ ప్రస్థానానికి 100 సంవత్సరాలు – నూతన ఆశయాలు” అనే శీర్షికతో జరిగిన కార్యక్రమంలో శనివారం ప్రసంగిస్తూ మొదటి వర్గంలో తమ గుర్తింపును బహిరంగంగా చాటుకునే వారు ఉంటారని చెప్పారు.
వారు “మేము హిందువులమని గర్వంగా చెప్పండి” అని అంటారు. రెండవ వర్గంలో, గుర్తింపును అంగీకరించి, కానీ గర్వపడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించే వారు ఉంటారని ఆయన పేర్కొన్నారు. వారు “అవును, మేము హిందువులమే, కానీ గర్వపడటానికి ఏముంది?” అని అడుగుతారని తెలిపారు. ఆ తర్వాత ఆయన విచక్షణకు ప్రాధాన్యత ఇచ్చే మూడవ విభాగాన్ని వర్ణించారు.
వారు “మేము హిందువులమని నెమ్మదిగా చెప్పండి — ఇంట్లో అడిగితే చెబుతాము” అని అంటారని, నాల్గవ వర్గంలో, తమ గుర్తింపును పూర్తిగా మరచిపోయినవారు లేదా మరచిపోయేలా చేయబడినవారు ఉంటారని ఆయన వివరించారు. “మరింత మంది మరచిపోయేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆయన హెచ్చరించారు.
ఆర్ఎస్ఎస్ ఎవరికీ వ్యతిరేకం కాదని, అది అధికారాన్ని గానీ, ప్రచారాన్ని గానీ కోరుకోదని, ఏ సంఘటనకూ ప్రతిచర్యగా పనిచేయదని చెబుతూ దేశంలో జరుగుతున్న సానుకూల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, వాటిని బలోపేతం చేయడమే దాని లక్ష్యమని ఆయన తెలిపారు.
సంఘ్ రూట్ మార్చ్‌లు నిర్వహించినప్పటికీ, అది పారామిలిటరీ దళం కాదని, దాని స్వచ్ఛంద కార్యకర్తలు లాఠీలు పట్టుకున్నప్పటికీ, దానిని ఒక “అఖాడా” (కుస్తీ క్లబ్)గా చూడకూడదని భాగవత్ చెప్పారు. సంఘ్ నేపథ్యం ఉన్న కొందరు వ్యక్తులు రాజకీయ జీవితంలో చురుకుగా ఉన్నప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయాల్లో పాలుపంచుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
1925లో ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భావానికి ముందు దేశంలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుతూ, బ్రిటిష్ వారు భారత జాతీయ కాంగ్రెస్‌ను ఒక “సేఫ్టీ వాల్వ్”గా స్థాపించారని, కానీ భారతీయులు దానిని స్వాతంత్ర్య పోరాటంలో ఒక శక్తివంతమైన సాధనంగా మార్చారని భాగవత్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌ను ప్రస్తావిస్తూ,13 ఏళ్ల వయసులో ప్లేగు వ్యాధితో తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడం, ఆ తర్వాత ఆయన ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గురించి తెలిపారు.
హెడ్గేవార్ తన పాఠశాల రోజుల్లో వందేమాతరం ఉద్యమంతో సహా స్వాతంత్ర్య పోరాటంలోని వివిధ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని భగవత్ చెప్పారు. ఆయన మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనప్పుడు, నాగ్‌పూర్‌లోని కొందరు ఆయనను వైద్య విద్య కోసం కలకత్తా పంపడానికి నిధులు సేకరించారని, అక్కడ ఆయన విప్లవ సమూహాలతో పరిచయం ఏర్పరచుకున్నారని తెలిపారు.
ఆ కాలంలోని ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, కోకెన్‌చంద్ర అనే వ్యక్తి పేరు నుండి ప్రేరణ పొంది హెడ్గేవార్ “కోకెన్” అనే సంకేత నామంతో పనిచేశారని భాగవత్ చెప్పారు. ఒకసారి, కోకెన్‌చంద్రను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు బృందం పొరపాటున హెడ్గేవార్‌ను అదుపులోకి తీసుకుందని, ఈ సంఘటన రష్ బిహారీ బోస్ రాసిన ఒక పుస్తకంలో నమోదు చేశారని ఆయన చెప్పారు.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వంటి సంస్కర్తలు, నాయకులచే ప్రాతినిధ్యం వహించిన వివిధ రకాల ఆలోచనా విధానాలను ప్రస్తావించారు. “అయినప్పటికీ, సమాజానికి దిశానిర్దేశం చేసే, ఒక (అనుకూలమైన) వాతావరణాన్ని సృష్టించే పని కొంతవరకు జరగడం లేదని కనిపిస్తోంది,” అని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ హెడ్గేవార్ వైవిధ్యాలతో నిండిన సమాజాన్ని నాణ్యత , ఐక్యత అనే పునాదులపై నిలబెట్టడానికి ఒక ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. ఆ సూత్రాన్ని, పద్ధతిని కనుగొన్న తర్వాత, ఆయన 1925లో విజయదశమి నాడు తన ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆ రోజు నుండి యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేసే సంఘం ప్రారంభమవుతుందని ప్రకటించారని చెప్పారు. యావత్ దేశాన్ని సంఘటితం చేయడం తప్ప తమకు మరో పని లేదని సంఘం ముందుగానే నిర్ణయించుకుందని వివరించారు.
భారతదేశ నాగరిక స్వభావం ఇప్పటికే ప్రజలలో అంతర్లీనంగా ఉందని చెబుతూ భారతదేశానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ స్వభావాన్ని తమలో కలిగి ఉంటారని, దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈ సామూహిక అనుబంధంలో సమాన భాగమని ఆయన స్పష్టం చేశారు. ‘హిందూ’ అనే పదాన్ని నామవాచకంగా కాకుండా విశేషణంగా అర్థం చేసుకోవాలని తాను చాలా కాలంగా చెబుతున్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ నిర్వచనానికి సరిపోతారని నొక్కి చెప్పారు.
విస్తృత తాత్విక భావనలను ప్రస్తావిస్తూ, సాధారణంగా ఉపయోగించే ‘లౌకికవాదం’ అనే పదం భారతదేశ స్ఫూర్తిని సరిగ్గా ప్రతిబింబించదని భాగవత్ చెప్పారు. దానికి బదులుగా, ‘పంథ-నిరపేక్షత’ లేదా అన్ని మతాల పట్ల తటస్థ వైఖరిని ఆయన సూచిస్తూ ధర్మమే జీవితానికి మూలమని స్పష్టం చేశారు

More Stories
తాజా అమెరికా మ్యాప్ లో భారత్ లో పిఓకె, ఆక్సాయ్ చిన్
బీఆర్ఎస్, కాంగ్రెస్ కారణంగా తెలంగాణ ఖజానా ఖాళీ
భారత్‌కు బలమైన కరెన్సీగా నమ్మకం