బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన పెద్ద పెద్ద వ్యక్తులను భయపెడుతున్న ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం ఇప్పుడు ఈ వివాదం బాలీవుడ్‌కి కూడా చేరింది. హిందీ సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖుల పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారే దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, ప్రముఖ రచయిత దీపక్ చోప్రా. దీంతో బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 

ఎప్‌స్టీన్ నిర్వహించిన ఓ ఈవెంట్ కోసం అనురాగ్ కశ్యప్ 2017లో బీజింగ్ వెళ్లాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అనురాగ్ కశ్యప్, “నాకు చాలా ఆహ్వానాలు వస్తాయి. కానీ నేను ఇప్పటివరకు జీవితంలో ఒక్కసారి కూడా బీజింగ్ వెళ్లలేదు” అంటూ స్పష్టంగా ఖండించారు. ఇక దీపక్ చోప్రా మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ ఎలాంటి నేరపూరిత పనుల్లో పాల్గొనలేదు. ఎప్‌స్టీన్‌తో నా పరిచయం చాలా పరిమితమే. లైంగిక నేరాల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పారు. 

అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలనే ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటారు. ఎప్‌స్టీన్ ఓ అమెరికన్ బిలియనీర్. అతను మైనర్ బాలికలను లైంగిక అక్రమ రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. 2019లో జైలులో ఉన్న సమయంలో ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు విచారణలో సేకరించిన కోర్టు పత్రాలు, సాక్ష్యాలు, విమాన ప్రయాణ వివరాలు, కాంటాక్ట్ లిస్టులను అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విడతల వారీగా బయటకు తీస్తోంది. 

అయితే ఫైల్స్‌లో పేరు ఉండటం మాత్రమే నేరానికి రుజువు కాదు. కొందరు ఎప్‌స్టీన్‌కు తెలిసినవారు, కొందరు అతని విమానంలో ప్రయాణించినవారు మాత్రమే.  ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఫైల్స్‌ను పూర్తిగా విడుదల చేయాలనే బిల్లుపై సంతకం చేశారు. దీని వల్ల దాదాపు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2000కు పైగా వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఒక వైపు ఉంటే, నిరపరాధుల గోప్యతను కాపాడాల్సిన బాధ్యత మరోవైపు ఉంది. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం పాటించకపోతే, నిజం దాచేస్తున్నారన్న అనుమానం పెరుగుతుంది.