బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు అవినీతి, అరాచకాల ద్వారా రాష్ట్రాన్ని దోచుకుని తమ జేబులు నింపుకున్నారని, పేదలు, రైతులకు మాత్రం చేసిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మహారాష్ట్రతో నీటి గొడవలు ఉన్నాయని 20, 25 ఏళ్లుగా ఈ గొడవలు కొనసాగినా తెలంగాణ వచ్చాక తాము గొడవలు పెట్టుకోవాలని అనుకోలేదని ఫడ్నవిస్ తెలిపారు.
“తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015లో నాటి సీఎం కేసీఆర్ మా వద్దకు వచ్చి గోదావరి జలాలు మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాడు కేసీఆర్ కు ఒక్కటే చెప్పాం.. మనమంతా భారతీయులమని ఈ గొడవలు వద్దని చెప్పాం. అయితే ప్రాజెక్టు ఎత్తు కొంచెం తగ్గించుకుంటే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, అలాగే గడ్చిరోలి ముంపు నుంచి బయటపడుతుందని చెప్పాం” అని గుర్తు చేశారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలాంటి గొడవలు లేకుండా తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ ఇవాళ తెలంగాణలో ఉన్న ఇరిగేషన్‍కు తమ కృషి వల్లే జరిగిందని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రాణహిత ప్రాజెక్టు గురించి అడుగుతున్నారని చెబుతూ మున్సిపల్ ఎన్నికల తర్వాత చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని ఎమ్మెల్యే హరీశ్ బాబును ఆయన ఆహ్వానించారు.
మహారాష్ట్రకు నష్టం లేకుండా పొరుగు రాష్ట్రానికి మేలు జరుగుతుంటే స్వాగతిస్తామని ఫడ్నవిస్ భరోసా ఇచ్చారు. ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతుంది అంటే దాని కోసం చర్చిద్దామని, నీళ్లు ఇచ్చేందుకు తమకు సంతోషమే అని స్పష్టం చేశారు. మేడిగడ్డతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని ఆయన విమర్సించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి హైవే నిర్మాణం చేపడతామని ఆయన ప్రకటించారు. మహారాష్ట్రలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ మహారాష్ట్రకు పొరుగునే ఉందని చెబుతూ మహారాష్ట్ర గాలితో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ బిజెపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

More Stories
భారత్కు బలమైన కరెన్సీగా నమ్మకం
జీడీపీలో 70.7 శాతంకు చేరిన పాకిస్తాన్ రుణభారం
నక్సల్స్ అంతంతో బస్తర్లో భయం, అపనమ్మకం తొలగిపోయాయి