ఈ సందర్భంగా డా. భగవత్ మాట్లాడుతూ ‘‘బంగ్లాదేశ్‌లో 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వారితోపాటు మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మద్దతు ఇస్తారు’’ అని తెలిపారు. వారు ఏకమైతే, అక్కడి రాజకీయ వ్యవస్థను తమ ప్రయోజనాలు కాపాడేవిధంగా, తమ భద్రత కోసం ఉపయోగించుకోగలరని, అయితే వారు తప్పనిసరిగా ఏకం కావాలని చెప్పారు.
అదృష్టవశాత్తూ, ఈసారి వారు పారిపోకూడదని, అక్కడే ఉండి పోరాడాలని నిర్ణయించుకున్నారని బంగ్లాదేశ్ లోని హిందువుల గురించి తెలిపారు. ఇప్పుడు, వారు పోరాడబోతున్నట్లయితే, ఐక్యత చాలా అవసరం. వారు ఎంత త్వరగా ఏకమైతే అంత మంచిదని సూచించారు
“ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల సంఖ్యతో, వారు తమ పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుచుకోగలరు. దీనిని సాధించడంలో, ఇక్కడ మా పరిమితులకు లోబడి మేము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమతమ చోట్ల, వారి కోసం మా వంతుగా చేయగలిగినదంతా చేస్తాము. ఆ హామీ నేను మీకు ఇవ్వగలను,” అని ఆయన భరోసా ఇచ్చారు.
మరోవైపు భారతదేశంలోని మైనారిటీలు, ఇతర అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ లో ఇలాంటి అంశాలకు సంబంధించి గత ప్రభుత్వాలు సరిగ్గా స్పందించలేదు. జనాభా పెరుగుదల, మార్పులను ప్రభుత్వాలు గుర్తించలేదు. దీనికి కొన్ని వర్గాల జననాల రేటు, అక్రమ వలసలు వంటివి ప్రధాన కారణాలు. ఇప్పుడే ప్రభుత్వం దీనిపై స్పందిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి” అని చెప్పారు.
సంఘ్ కార్యకలాపాలు, దాని భవిష్యత్ దిశ, సామాజిక సామరస్యం ప్రాముఖ్యత గురించి నిష్కపటంగా మాట్లాడుతూ, సంస్థలో నాయకత్వాన్ని నిర్ణయించడంలో కులానికి ఎలాంటి పాత్ర లేదని భాగవత్ స్పష్టం చేశారు. “సంఘ్ అధిపతి బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడు కూడా కాదు. సంఘ్‌లో ఒక వ్యక్తి యోగ్యతను వారి పనిని బట్టి నిర్ణయిస్తారు,” అని ఆయన తెలిపారు.
సేవ చేయడానికి అత్యంత సమర్థులుగా, అందుబాటులో ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) లేదా షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) వర్గానికి చెందిన వ్యక్తి కూడా సర్ సంఘచాలక్ కాగలరని భాగవత్ పేర్కొన్నారు. “ఎవరు అంకితభావంతో పని చేస్తారో వారు ముందుకు సాగుతారు,” అని ఆయన తెలిపారు.
ఆర్ఎస్ఎస్ కులాలకు ప్రాధాన్యం ఇవ్వదని, అన్ని వర్గాలను కలపాలన్నదే తమ ధ్యేయం అని చెబుతూ ఎస్సీ, ఎస్టీల మీద వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది బ్రాహ్మణులు స్తాపించిన సంస్థ అయినప్పటికీ ఎవరైనా దీనికి అధ్యక్షులు కావొచ్చని తెలిపారు.
“మాకు వచ్చే నిధుల గురిచి చాలా మంది అడుగుతున్నారు. మేం మా కార్యకర్తల నుంచి నిధులు సేకరిస్తాం. మేం ఎక్కడికైనా వెళ్తే ఆహారంకు డబ్బులు అడిగే బదులు ఆహారమే అడుగుతాం. మేం హోటళ్లలో ఉండం. కార్యకర్తల ఇండ్లలోనే బస చేస్తాం. మాకు అధికారం అవసరం లేదు. అందరినీ ఏకం చేయాలన్నదే మా లక్ష్యం” అని వివరించారు.
తన వయస్సు గురించి ప్రస్తావిస్తూ, “నిబంధనల ప్రకారం 75 ఏళ్లు నిండిన తర్వాత ఎలాంటి అధికారిక పదవిని చేపట్టకుండా పని చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. “75 ఏళ్లు పూర్తయిన తర్వాత పదవీ విరమణ చేయాలని నేను కోరుకున్నాను. కానీ నా సహచరుల పట్టుదల మేరకు నేను ఇప్పటికీ ఈ బాధ్యతను నిర్వహిస్తున్నాను. నేను నా అధికారిక విధులకు పదవీ విరమణ చేస్తాను, కానీ పని నుండి కాదు. చివరి రక్తపు బొట్టు వరకు మనం సమాజం కోసం పని చేయాలి” అని వివరించారు.
అంతేకాకుండా, ఆయన ముస్లిం సమాజంతో సంబంధాల గురించి మాట్లాడుతూ, సహజీవనం, సామాజిక సామరస్యంల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఒక రూపకాన్ని ఉపయోగిస్తూ, నాలుక పళ్ల మధ్యకు వస్తే పళ్లు విరిగిపోవని, అంటే సమాజంలోని విభేదాలను శత్రుత్వం లేకుండా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ముస్లిం సమాజం భారతీయ సమాజంలో ఒక అంతర్భాగమని, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు వారి మధ్య చురుకుగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
మత మార్పిడి విషయంపై భాగవత్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి తమకు నచ్చిన దేవుడిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని తెలిపారు. అయితే, బలవంతంగా లేదా ప్రలోభాలతో మత మార్పిడి జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి పద్ధతులకు ప్రతిస్పందనగా ‘ఘర్ వాపసీ’ (పునఃమత మార్పిడి) జరుగుతుందని, అది జరగాలని ఆయన పేర్కొన్నారు.
జాతీయ ఐక్యత గురించి కూడా మాట్లాడుతూ, “2047లో అవిభక్త భారతదేశాన్ని ఊహించుకోండి” అని సూచించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులు వారంతట వారే విఫలమవుతారని చెబుతూ భారతదేశాన్ని విభజించాలని కలలు కనేవారు తమ ప్రణాళికలను నెరవేర్చడంలో ఎప్పటికీ విజయం సాధించలేరని ఆయన హెచ్చరించారు.

More Stories
ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరికి, రాజీ వైఖరికి తావులేదు
కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ సతీమణికి పాకిస్థాన్‌తో సంబంధాలు
ఆదర్శంగా నిలబడితేనే ప్రపంచంకు భారత్ మార్గదర్శకత్వం