నక్సలిజం వల్ల యువత, గిరిజనులు, దళితులు భారీగా నష్టపోయారని పేర్కొంటూ మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యల వల్ల బస్తర్‌లో భయం, అపనమ్మకం తొలగిపోయాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. అలాగే పెద్ద సంఖ్యలో నక్స్‌లైట్లు లొంగిపోయారని, అందరిలా సాధారణమైన జీవితం గడిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.
శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో మూడు రోజుల బస్తర్ ‘పండుమ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ “బస్తర్ సహజ సౌందర్యం, సాంస్కృతిక సంపద ఎల్లప్పుడూ ప్రజలను ఆకర్షించాయి. కానీ దురదృష్టవశాత్తు నక్సలిజం అనే ముప్పు కారణంగా ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా నష్టపోయింది. అత్యధికంగా యువత, గిరిజనులు, దళితులే నష్టపోయారు” అని తెలిపారు.
“మావోయిస్టులతో సంబంధం ఉన్న చాలా మంది ఇప్పుడు హింసను విడిచిపెడుతున్నారు. నేడు, బస్తర్‌లో అభివృద్ధి జరుగుతోంది. సంవత్సరాలుగా మూసివేసిన పాఠశాలలు తిరిగి తెరుస్తున్నారు. దీంతో పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే రోడ్లు నిర్మిస్తున్నారు. ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన వారిని నేను స్వాగతిస్తున్నా” అని ద్రౌపదీ ముర్ము తెలిపారు.
గతంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిజాన్ని స్వీకరించిన వారు ఇప్పుడు ఆయుధాలను వదులుకుని జనజీవన స్రవంతిలోకి తిరిగి వస్తున్నారని ద్రౌపది ముర్ము తెలిపారు. వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోందని, లొంగిపోయిన నక్సలైట్లకు వివిధ రకాల శిక్షణలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఇలా తిరిగి వచ్చినవారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలని ఆమె సూచించారు.
శాంతి మార్గం నుంచి దారి మళ్లించాలనుకునే వారి మాటల విని మోసపోవద్దని రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ఒడిశాలోని చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక కుమార్తె ఈ రోజు రాష్ట్రపతిగా మాట్లాడుతుండటం భారత ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె చెప్పారు. వారికి అంతకంటే ఎక్కువ ధైర్యం, శక్తి ఉందని పేర్కొంటూ ప్రభుత్వం వారికోసం అంకితభావంతో పని చేస్తోందని ఆమె భరోసా ఇచ్చారు.
“సమాజంలోని పేద, అణగారిన, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. వీరి అభ్యున్నతి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఛత్తీస్‌గఢ్ వెనుకబడిన రాష్ట్రం కాదు. ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాంతం. గిరిజన సంస్కృతి అమూల్యమైనది, ప్రాచీనమైనదే అయినా శ్వాశతమైనది. సమానత్వం, సమ్మిళితత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే బస్తర్ పండుమ్ చూడాలి” అని ముర్ము పేర్కొన్నారు.
వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సుకు విద్య పునాదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. గిరిజన ప్రాంతాల పిల్లలు మంచి విద్యను పొందేందుకు ఏకలవ్య వంటి పాఠశాలలు ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. బస్తర్‌కు చెందిన గాడ్‌బోలే, ఇతరులు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారని, నిస్వార్థ సేవ అందించే వారు సమాజాన్ని ముందుకు నడిపిస్తారని ఆమె గుర్తు చేశారు.
బస్తర్‌లో అపారమైన సహజ వనరులు ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని ఆమె సూచించారు. ఇది భారతమాత గర్వాన్ని పెంచుతుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రమేన్ దేకా, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కూడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఏడాది బస్తర్ పండుమ్లో భాగంగా 12 విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో పాల్గొనేందుకు 54,000 మందికి పైగా నమోదు చేసుకున్నారు.

More Stories
యూ-19 ప్రపంచ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా
ముంబైలో తొలి బిజెపి మేయర్ గా రితు తవాడే
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం ముసాయిదా విడుదల