ఢిల్లీలో ఇటీవల అమ్మాయిలు ఎక్కువగా తప్పిపోతున్నారంటూ స్థానికంగా ఢిల్లీ పరిధిలోని యూజర్ల వాట్సాప్, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అక్కడి మహిళలు, యువతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో జరుగుతున్న ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని ఢిల్లీ పోలీసులు సూచించారు.
ఇదంతా ప్రజల్ని భయపెట్టడానికి జరుగుతున్న ఆన్లైన్ పెయిడ్ ప్రచారం అని, వైరల్ కంటెంట్ ఒరిజినల్స్‌ను విశ్లేషించి చెబుతున్నామని తెలిపారు. అమ్మాయిలు ఎక్కువగా మిస్ అవుతున్నారంటూ కొందరు చేస్తున్న పెయిడ్ ప్రచారాన్ని నమ్మవద్దని, ఇలాంటివి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.
ఢిల్లీ పోలీసులు వెల్లడించిన డాటా ప్రకారం గత జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీ నగరంలో 807 మంది కనిపించకుండా పోయారు. సగటున రోజుకు 54 మంది తప్పిపోయారు. వీరిలో 509 మంది స్త్రీలు, 298 మంది పురుషులు. ఇందులో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దవారు. జనవరి 1 నుంచి జనవరి 27 వరకు ఉన్న డేటా ప్రకారం తప్పిపోయిన వారిలో 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.
సగటున రోజుకు 27 మంది తప్పిపోగా, 9 మందిని గుర్తించారు. మొత్తంగా 181 మందిని గుర్తించారు. వీరిలో 90 మంది పురుషులు, 91 మంది స్త్రీలు ఉన్నారు. 435 మంది పెద్దవారి ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే ఈ డేటా ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మిస్సింగ్ కేసులు ఏమీ పెరగలేదని పోలీసులు అంటున్నారు.
ఇంకా చెప్పాలంటే ఈ జనవరిలో మిస్సింగ్ కేసులు తగ్గాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ త్యాగి తెలిపారు. అందువల్ల మహిళలు ఎక్కువగా తప్పిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. అయితే, హిందీ చిత్రం మర్దానీని ప్రమోట్ చేసేందుకే ఈ తరహా ప్రచారాన్ని మొదలుపెట్టారని బిజెపి విమర్శిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష ఆప్ మాత్రం బిజెపి ఢిల్లీని మిస్సింగ్ పీపుల్ సిటీగా మారుస్తున్నారని మండిపడింది

More Stories
గడ్చిరోలి జిల్లాలో ముగ్గురు నక్సలైట్లు హతం
ఉప ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కుకీ గ్రూపులు మణిపూర్ బంద్
మేఘాలయ బొగ్గు గనిలో పేలుడు- 18 మంది మృతి