ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడిలో 70 మందికి పైగా మృతి!

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడిలో 70 మందికి పైగా మృతి!
పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని షెహజాద్‌ ప్రాంతంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. షియా మసీదు లోపల జరిగిన పేలుడులో 70 మందికి పైగా మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, దాడికి పాల్పడ్డ వ్యక్తి విదేశీయుడని, అతడికి తెహ్రీక్-ఎ-తాలిబాన్​తో సంబంధాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. మొదట నిందితుడు ఇమామ్​బర్గా గేటు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారని, అయినప్పటికీ అతడు తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. అయితే, ఈ దాడికి బాధ్యులెవరనే విషయంపై ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు. గాయపడిన వారిని చికిత్స కోసం పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిఐఎంఎస్), పాలీక్లినిక్ ఆసుపత్రికి తరలించారు.

ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించారు. ఆత్మాహుతికి ఎవరు పాల్పడ్డారు.. ఏ పేలుడు పదార్థం వాడారు వంటి అంశాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ దాడిలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉంది. మసీదు గేటుతోపాటు, చుట్టుపక్కల బిల్డింగులు కూడా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. శరీర భాగాలు చాలా దూరం ఎగిరిపడ్డాయి. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

మరోవైపు, పాకిస్థాన్​ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్​ షరీఫ్​, సెనేట్​ ప్రతిపక్ష నాయకుడు అల్లామా రాజా నాసిర్​ అబ్బాస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.​ ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని పౌరుల ప్రాణాలు తీయడం హేమమని అబ్బాస్​ పేర్కొన్నారు. ఇటువంటి దాడులను తాము సంహిచబోమని తెలిపారు. ​

పాకిస్తాన్ దళాలు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రాడ్-ఉల్-ఫిట్నా-1 అనే భారీ ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. జనవరి 26న ప్రారంభించిన ఈ ఆపరేషన్‌లో, పాకిస్తాన్ దళాలు 216 మంది బలూచ్ తిరుగుబాటుదారులను మట్టుబెట్టాయి. అయితే, ఈ ఆపరేషన్‌లో 22 మంది భద్రతా సిబ్బంది, 36 మంది పౌరులు కూడా మరణించారు. 

బలూచిస్తాన్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉంది. అక్కడ చాలా కాలంగా తిరుగుబాటు కొనసాగుతోంది. బలూచ్ గ్రూపులు స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ దళాలను మరియు 60 బిలియన్ డాలర్ల  చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీC)కి సంబంధించిన ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.  గడిచిన ఆరు నెలల్లో రాజధాని నగరంలో జరిగిన పేలుళ్లలో ఇది రెండోదిగా తెలుస్తోంది. గత నవంబర్‌లో ఇస్లామాబాద్ కోర్టు సముదాయంలో జరిగిన కారు పేలుడులో దాదాపు 12 మంది మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు.