మహిళల ప్రీమియర్‌ లీగ్‌ విజేత బెంగళూరు

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ విజేత బెంగళూరు
 
మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) సీజన్‌-4 టైటిల్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) మహిళలజట్టు గెలుచుకుంది. కోటాంబిలోని బిసిఎ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. డబ్ల్యుపిఎల్‌ టైటిల్‌ చరిత్రలో 204పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక జట్టు ఛేదించడం ఇదే తొలిసారి. 
 
భారీ ఛేదనలో భాగంగా బెంగళూరుకు శుభారంభం దక్కకున్నా 2వ వికెట్‌కు కెప్టెన్‌ మంధాన, జార్జియో వోల్‌ 92బంతుల్లో 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బెంగళూరు గెలుపుకు 21 బంతుల్లో 30పరుగులు చేయాల్సిన దశలో వోల్‌(79; 54బంతుల్లో 14ఫోర్లు)ను మిన్నుమణి ఔట్‌ చేయడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. 
 
ఆ తర్వాత మంధాన(87; 41బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు)కి తోడు చివర్లో రాధా యాదవ్‌(12నాటౌట్‌; 5బంతుల్లో 2ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించారు. ఢిల్లీ బౌలర్లు హెన్రీకి రెండు, నందిని శర్మ, మిన్ను మణికి ఒక్కో వికెట్‌ దక్కాయి. అలాగే ఒక డబ్ల్యుపిఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ మంధాన రికార్డు పుటల్లోకెక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ స్మృతి మంధానకు దక్కాయి.
 
టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు 49పరుగుల పునాదిని వేశారు. లిజెల్లి లీ-షెఫాలీ వర్మ కలిసి ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 5.5ఓవర్లలోనే ఈ స్కోర్‌ సాధించింది. ఈ క్రమంలో షెఫాలీ వర్మ(20)ను అరుంధతి రెడ్డి పెవిలియన్‌ పంపింది. దాంతో. 49 పరుగుల వద్ద వీరి భాగస్వామ్యానికి తెరపడింది. 
 
క్రీజులోకి వస్తూనే లారా వొల్వార్డ్‌(44) మొదటి బంతిని బౌండరీకి పంపి, మరో ఎండ్‌లో లిజెల్లీ లీ(37) దూకుడు పెంచారు. దీంతో ఢిల్లీ జట్టు పవర్‌ ప్లే 6ఓవర్లలో వికెట్‌ నష్టానికి 53 పరుగులు చేసింది. ఆ తర్వాత కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌(57; 37బంతుల్లో 8ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో రోడ్రిగ్స్‌ను సయాలీ సత్‌గైర్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీ జట్టు 148పరుగుల వద్ద మూడో వికెట్లు కోల్పోయింది. 
 
ఆ తర్వాత వోల్వర్ట్‌(44) చివరి బంతికి రనౌట్‌ కాగా. హెన్రీ(35నాటౌట్‌)తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోర్‌ చేసింది. బెంగళూరు బౌలర్లు సయాలీ సత్‌గేర్‌, డి-క్లార్క్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.