మేఘాలయ బొగ్గు గనిలో పేలుడు- 18 మంది మృతి

మేఘాలయ బొగ్గు గనిలో పేలుడు- 18 మంది మృతి

మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్‌ జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక బొగ్గు గనిలో పేలుడు సంభవించి 18 మంది కార్మికులు మృతి చెందారు. ఈ గనిలో ఇంకా అనేకమంది కార్మికులు చిక్కుకుని ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. థాంగ్సు ప్రాంతంలోని ఒక గనిలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్‌ వికాష్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. 

పేలుడు సమాచారం తెలిసినవెంటనే పోలీసు బృందాలు అక్కడకు చేరుకున్నాయని, సహాయ చర్యలను ప్రారంభించాయని చెప్పారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సహాయం కూడా కోరామని తెలిపారు. జిల్లా అధికారులు ఇప్పటి వరకూ 16 మృతదేహాలను వెలికితీశారని చెప్పారు. బొగ్గు తవ్వకం కార్యకలాపాలు జరుగుతుండగా పేలుడు సంభవించిందని అనుమానిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదని, విచారణ జరుగుతోందని చెప్పారు. 

కాగా, పర్యావరణం, భద్రతా ప్రమాదాలు వంటి కారణాలతో మేఘాలయలో రాట్‌ హోల్‌ మైనింగ్‌, ఇతర అశాస్త్రీయ మైనింగ్‌ను ఎన్‌జిటి 2014లో రద్దు చేసింది. అయినా కూడా రాష్ట్రంలో ఇంకా రాట్‌ హోల్‌ మైనింగ్‌ కొనసాగుతోందని తాజా ప్రమాదం వెల్లడిస్తుంది. ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన  ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా బొగ్గు గని పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించారు. దీనికి కారణమైన వారిని గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీఎం సంగ్మాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్​ చేసి ఆరా తీశారు.

తూర్పు జైంటియా హిల్స్‌లో చోటుచేసుకున్న దురదృష్ట ఘటనలో కార్మికులు చనిపోవడం తీవ్ర బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికులకు సంతాపం ప్రకటించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం, అలాగే గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేయనున్నట్లు పేర్కొన్కారు.

సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ అని పిలుస్తారు. ఇలా నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్‌ హోల్‌గా వ్యవహరిస్తారు. సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగేలా ఉంటుంది. ఇతర సాంతకేతికతలతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో దీన్నే ఎక్కువగా వాడుతుంటారు.

అయితే, మేఘాలయలో ర్యాట్‌హోల్ మైనింగ్‌, అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలను 2014లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించింది. అనంతరం ఎన్‌జీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.