విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడవలసి ఉన్న ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. 8 మంది విపక్ష ఎంపీలను మంగళవారం సస్పెండ్ చేయడం, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకి చెందిన అముద్రిత పుస్తకం నుంచి చైనాకు సంబంధించిన కొన్ని అంశాలను ఉటంకించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌సహా విపక్ష పార్టీల ఎంపీలు లోక్‌సభలో అలజడి సృష్టించారు.
వాయిదా అనంతరం సాయంత్రం 5 గంటలకు సభా కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగానే ప్రధాని మోదీ ఇక ప్రసంగిస్తారని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా వర్షా గైక్వాడ్, జ్యోతిమణిలసహా విపక్షానికి చెందిన కొందరు మహిళా ఎంపీలు మోదీతోసహా అధికార పక్షానికి చెందిన ఎంపీల సీట్లను అడ్డుకున్నారు. ‘ఏది సరైనదో అదే చేయండి’ అన్న అక్షరాలు రాసిన పెద్ద బ్యానర్‌ను పట్టుకుని వారు నిరసన తెలిపారు. 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను వారు తీవ్రంగా ఖండించారు. ఇంతలో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను వాయిదా వేశారు.
కాగా, ప్రధాని మోదీపై మహిళా ఎంపీలు దాడి చేసి ఉండేవారని బీజేపీకి చెందిన మనోజ్ తివారీ ఆ తర్వాత వ్యాఖ్యానించారు. “జరిగిన ఘటన చాలా భయంకరమైనది. కాంగ్రెస్ నిస్పృహకు ఇది పరాకాష్ఠ. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మహిళా ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. కిరణ్ రిజిజు వెంటనే ఆలోచించబట్టే పరిస్థితి అదుపులోకి వచ్చింది” అని మనోజ్ తివారీ ధ్వజమెత్తారు.
“ప్రధానమంత్రి కూర్చునే చోటు వరకు వారు ఎక్కి వెళ్లారు. వారు అక్కడ పెద్ద గొడవ సృష్టించారు,” అని తివారీ ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీలు దూకుడుగా ప్రవర్తిస్తూ వచ్చారని, ఇది తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తించిందని ఆయన తెపారు. వారు “ప్రధానమంత్రిపై దాడి కూడా చేసి ఉండవచ్చని” ఆయన పేర్కొన్నారు. “ప్రధానమంత్రి కుర్చీని అడ్డుకోవడానికి మహిళా సభ్యులను ముందుకు పంపడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఎన్నికల ఓటములతో మీరు ఎంతగానో కలత చెందారు, అందుకే మీరు ప్రధానిపై దాడి చేయడానికి కూడా సిద్ధపడ్డారు,” అని ప్రతిపక్షంపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ తివారీ ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాల నిరసనల కారణంగానే ప్రధాని సభకు రాలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అధికార పార్టీపై ఎదురుదాడి చేశారు. “ఆయన భయపడ్డారు, అందుకే సభకు రాలేదు,” అని ఆమె పేర్కొన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై కూడా ఆమె విమర్శలు గుప్పిస్తూ, వారు “బుల్లెట్ రైలులా పారిపోయారని” ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ ప్రసంగం రద్దు కావడంతో గురువారం దీనిపై చర్చ కొనసాగనున్నది. ధన్యవాదాల తీర్మానానికి లోక్‌సభ ఆమోదం ఇంకా పొందవలసి ఉంది. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత మోదీ ప్రసంగించే అవకాశం ఉన్నది.

More Stories
అజిత్ దోవల్ బెదిరింపులతో ఒప్పందంకు దిగివచ్చిన ట్రంప్?
ఎన్నికల ముందు బంగ్లా మైనారిటీలు ఎందుకు భయపడుతున్నారు?
మణిపుర్ నూతన సీఎంగా యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్