అగ్నిగోళంలా మారిన సూర్యుడుతో భారత్‌కు ముప్పు

అగ్నిగోళంలా మారిన సూర్యుడుతో భారత్‌కు ముప్పు
జీవజాతికి ప్రాణాధారమైన సూర్యుడు ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చాడు. సూర్యుడి ఉపరితలంపై ‘యాక్టివ్ రీజియన్ 14366’ అనే అయస్కాంత ప్రాంతంలో వరుసగా భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1న సంభవించిన X8.1 క్లాస్ సౌర జ్వాల శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది 2026 సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన పేలుడుగా నమోదైంది. 
 
ఈ పేలుళ్ల వల్ల వెలువడే విద్యుదయస్కాంత రేడియేషన్ కాంతి వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో భూమి పైపొరల్లోని ఐనోస్పియర్ దెబ్బతినే అవకాశం ఉంది.సౌర జ్వాలల ప్రభావం వల్ల భూమిపై ‘రేడియో బ్లాక్ ‘ సంభవించే ప్రమాదం ఉందని ఇస్రో హెచ్చరించింది.  అంటే మనం నిత్యం వాడే హై-ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు.
 
దీని వల్ల విమానయానరంగంలో కమ్యూనికేషన్ ఇబ్బందులు కలగడమే కాకుండా సముద్రంలో ప్రయాణించే నౌకల రాడార్ వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అంతే కాకుండా విద్యుత్ గ్రిడ్లు విఫలం కావడం, జీపీఎస్ నావిగేషన్ సిగ్నల్స్ తారుమారు అవ్వడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. దీని వల్ల సామాన్యుల ఫోన్ సిగ్నల్స్, టీవీ ప్రసారాలకు కూడా కొంతమేరకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

అంతరిక్షంలో ప్రస్తుతం భారతదేశానికి చెందిన 50కి పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. సౌర తుఫాను సమయంలో వెలువడే రేడియేషన్ వల్ల ఈ శాటిలైట్లలోని సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇస్రో టెలిమెట్రీ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్) ఈ ఉపగ్రహాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది.  ఒకవేళ కమ్యూనికేషన్‌లో ఏదైనా అంతరాయం కలిగినా లేదా టెక్నికల్ సమస్యలు తలెత్తినా వెంటనే సరిదిద్దేందుకు శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్ నుంచి అప్రమత్తంగా ఉన్నారు.
రంగంలోకి ‘ఆదిత్య-ఎల్1’.. రక్షణ కవచంలా నిఘా సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారత్ పంపిన ‘ఆదిత్య-ఎల్1’ వ్యోమనౌక ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది. 
భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నౌక, సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్, అయస్కాంత క్షేత్రాలను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. భూమికి ఈ తుఫాను ప్రభావం తగలడానికి ముందే ఆదిత్య-L1 హెచ్చరికలు పంపడం వల్ల ఇస్రో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది మన అంతరిక్ష మౌలిక సదుపాయాలను కాపాడుకోవడంలో ఓ రక్షణ కవచంలా పనిచేస్తుంది.

సూర్యుడు ఎందుకు ఇలా అకస్మాత్తుగా కోపగిస్తాడు? ఇలాంటి తుఫానులు ఎప్పుడు వస్తాయి? అనే విషయాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లడఖ్‌లో రూ. 1000 కోట్లతో భారీ సోలార్ టెలిస్కోప్‌ను (ఎన్ఎల్ఎస్ టి) ఏర్పాటు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ టెలిస్కోపుల్లో ఒకటిగా నిలవనుంది.