అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
 
అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఘన విజయం నమోదు చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ జార్జి సెంచరీకి తోడు, సూర్యవంశీ, కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే అర్ధసెంచరీలతో రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని 41.1ఓవర్లలో భారతజట్టు కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో టీమిండియా రికార్డుస్థాయిలో 10వ సారి ఫైనల్‌కు చేరింది. 
హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారతజట్టు 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘన్‌ లక్ష్యాన్ని 41.1 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. భారత ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 104 బంతులు ఎదుర్కొన్న జార్జ్‌ 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. 
మరోవైపు, యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆఫ్ఘన్‌ బౌలర్లను వణికించాడు. వైభవ్‌ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌ రేట్‌ 206.06గా నమోదవ్వడం విశేషం. జార్జ్‌ తన అద్భుత ప్రదర్శనకు గాను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు. తొలి వికెట్‌ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే సైతం రాణించాడు. ఆరోన్‌ జార్జ్‌తో కలిసి రెండో వికెట్‌కు 101 బంతుల్లో 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించాడు. 
ఆయుష్‌ 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం విహాన్‌ మల్హోత్రా (38 నాటౌట్‌), వేదాంత్‌ త్రివేది (5 నాటౌట్‌) మ్యాచ్‌ను ముగించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. అండర్ 19 వరల్డ్ కప్‌ చరిత్రలో ఇంతటి భారీ స్కోర్ ఎప్పుడూ ఎవ్వరూ చేయలేదు. 2005లో ఐర్లాండ్ పై న్యూజీలాండ్ అత్యధికంగా 305 స్కోర్ చేసింది. 
ఈ మ్యాచ్‌లో భారత్‌ సాధించిన విజయం అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత భారీ ఛేజింగ్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. 311 పరుగుల లక్ష్యాన్ని భారతజట్టు కేవలం 41.1ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022 ఛాంపియన్‌గా నిలిచిన భారతజట్టు 2006, 2016, 2020, 2024లలో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు 10వ సారి ఫైనల్‌కు చేరి 6వ టైటిల్‌పై కన్నేసింది.

ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇద్దరు సెంచరీలు సాధించారు. ఫైజల్ షినోజోదా 110 పరుగులు (93 బంతుల్లో 15 ఫోర్లు), ఉజైరుల్లా 101 పరుగులు, నాటౌట్ (86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు)తో ఆకట్టుకున్నారు. తర్వాత ఉస్మాన్ సాదత్ 39 పరుగులు, ఖలీద్ అహ్మద్జాయ్ 31 పరుగులు సాధించారు.  ఇండియన్ బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేశ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 311 పరుగుల భారీ లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. 

సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించిన భారత్‌, మరోసారి టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఐసిసి అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు సెమీఫైనల్‌ చేరడం వారి చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్‌లో కూడా ఇదే తరహా ప్రదర్శన కనబరిస్తే టీమిండియా ఆరోసారి విశ్వవిజేతగా నిలవడం ఖాయం.