తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బిజెపి సాధించాలి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బిజెపి సాధించాలి
గత ఎన్నికల్లో తెలంగాణాలో 35 శాతం ఓట్ల శాతం సాధించిన బిజెపి ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సహించాలని పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడైన తర్వాత మొదటి సారి తెలంగాణలో పర్యటించిన ఆయన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో బుధవారం ప్రసంగించారు.
 
అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కమీషన్ల పేరుతో ఆర్‌ఆర్‌ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ కట్టాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొంటూ బీజేపీకి అధికారం అప్పగించి అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. 
 
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, ఎన్నికల హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.  తెలంగాణకు సముచిత స్థాయిలో కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని చెబుతూ తెలంగాణలో రైల్వేకు రూ.5400 కోట్లకు పైగా కేటాయించిందని పేర్కొన్నారు.
తెలంగాణకు మూడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు గెలుపు లక్ష్యంగా పని చేయాలని నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం అందించాలని కార్యకర్తలకు, ఓటర్లను ఆయన కోరారు. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను సహించమని నితిన్ నబీన్ హెచ్చరించారు. 
హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా కాంగ్రెస్‌ సర్కారు నోరు మెదపట్లేదని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములు ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ నిధులను మైనార్టీలకు బదలాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉందని గుర్తు చేశారు. 
ముస్లింల ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే.. ఎక్కువ రోజులు ఉండబోదంటూ హెచ్చరించారు. ప్రధాని మోదీ  మహిళలను లక్షాధికారులను చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలను పూర్తిగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు నితిన్ నబీన్ సూచించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు డెయిలీ సీరియల్‌లా మారిందని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దొందూ దొందేనని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ నేతృత్వంలో బీజేపీ జెండా ఎగరాలని, మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పాలమూరు జిల్లాలో రైల్వే ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నామని, రూ.50 వేల కోట్లు రైల్వే ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్, రాహుల్ గాంధీ మధ్య ఒప్పందం కుదిరిందని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయ దురహంకారం పెరిగిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు మండిపడ్డారు. బీజేపీని చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలిస్తే మాత్రం ట్యాక్స్‌లు పెరుగుతాయని హెచ్చరించారు.