* బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తొలిసారి తెలంగాణాలో నేడే పర్యటన
తెలంగాణాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. బిజెపి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 7,8 తేదీల్లో పలు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
పవన్ కళ్యాణ్ ను ఆయన నివాసంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమై ఎన్నికల గురించి చర్చించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఆయన ఈ సందర్భంగా సానుకూలత వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే జనసేన పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి భారీ స్థాయిలో చేరికలను ప్రోత్సహించడం, సమన్వయ కమిటీలను నియమించడం వంటి చర్యలతో కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కానీ, తీరా నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఆ హడావుడి కనిపించడం లేదు. ఎన్నికల బరిలో నిలవాలని ఉత్సాహం చూపిన అభ్యర్థులకు పార్టీ తరపున కనీస మార్గదర్శకత్వం కరువైనట్లు కనిపిస్తోంది. దానితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది? ఎంతమందికి పార్టీ అధికారికంగా ‘బీ-ఫారాలు’ అందజేసింది? అనే విషయంలో పార్టీ నాయకత్వానికే స్పష్టత లేనట్లుగా కనిపిస్తోంది.
మరోవంక, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మొదటిసారి తెలంగాణాలో బుధవారం పర్యటిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న కార్యకర్తల సమ్మేళనంలో ప్రసంగిస్తారు. ఈ సమ్మేళనం బూత్ స్థాయి కార్యకర్తలు, మున్సిపల్ నాయకులు, పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహం, ప్రేరణనిచ్చే వేదికగా కాగలదని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా పార్టీ కార్యకర్తలు నితిన్ నబిన్ ప్రసంగాన్ని వీక్షిస్తూ ఈ సమ్మేళనంలో వర్చువల్‌గా భాగస్వాములవుతారు.

More Stories
ఐఏఎస్ అర్వింద్ కుమార్ను సస్పెండ్
స్వదేశీ భావజాలం పునరుజ్జీవనంకై “రన్ ఫర్ స్వదేశీ”కి శ్రీకారం
దేశ రక్షణ సంస్థల పరిసరాల్లో రోహింగ్యాల నివాసాలు