దేశీయ ఐటీ దిగ్గజాల షేర్లు 6 శాతం పతనం 

దేశీయ ఐటీ దిగ్గజాల షేర్లు 6 శాతం పతనం 

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో షేర్లు బుధవారం ఒక్కరోజే 6 శాతం వరకు పడిపోయాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో వచ్చిన ఒక కొత్త మార్పు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ సేవల భవిష్యత్తుపై ఆందోళనలు రేకెత్తించడమే ఇందుకు ప్రధాన కారణం.

బుధవారం ఉదయం 11.45 గంటల సమయంలో దేశీయ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్లు నష్టపోయి, 83,603 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు కోల్పోయి, 25,714 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.54గా ఉంది. నిఫ్టీ సూచీలో ఓఎన్‌జీసీ, ట్రెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎటర్నల్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో స్టాక్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ప్రముఖ ఎఐ సంస్థ ‘ఆంత్రోపిక్‌’ తన క్లాడ్‌ కొవర్క్‌ ప్లాట్‌ఫారమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆటోమేషన్‌ ప్లగిన్స్‌’ ఈ కలకలానికి కేంద్ర బిందువుగా మారాయి. ఈ కొత్త టూల్స్‌ కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా లీగల్‌ కాంట్రాక్టుల సమీక్ష, డేటా అనాలిసిస్‌, మార్కెటింగ్‌ పనులు వంటి సంక్లిష్టమైన విధులను స్వయంగా పూర్తి చేయగలవు. దీనివల్ల ఐటీ కంపెనీలు అందించే ‘అవుట్‌సోర్సింగ్‌’ సేవల అవసరం తగ్గిపోతుందనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది.

కేవలం చాట్‌ చేసే ఎఐ కాకుండా, పనులను స్వయంగా పూర్తి చేసే ` క్లాడ్ కోవర్క్’ కవర్క్’  ’ అనే టూల్‌ను ఆంత్రోపిక్‌ సంస్థ విడుదల చేసింది. ముఖ్యంగా లీగల్‌ కాంట్రాక్టులు, డేటా అనాలిసిస్‌, సేల్స్‌ వంటి పనులను ఇది తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తుంది. దీనివల్ల క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టులు తగ్గిపోతాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.

నిన్న అమెరికా మార్కెట్లలో నాస్డాక్‌ భారీగా పతనమైంది. ఆంత్రోపిక్‌ దెబ్బకు గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలైన థామ్సన్‌ రాయిటర్స్‌ (-18 శాతం), సేల్స్‌ఫోర్స్‌ (-7 శాతం) వంటివి కుప్పకూలాయి. ఆ సెగ నేడు భారతీయ ఐటీ కంపెనీలకు తగిలింది. మార్కెట్‌ విశ్లేషకులు ఈ పరిస్థితిని ‘సాస్‌పోకలిప్స్‌’ గా అభివర్ణిస్తున్నారు. అంటే, సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (SaaS) ఐటీ సేవల యుగం ముగిసి, ఏఐ ఏజెంట్ల యుగం మొదలైందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. క్లయింట్లు ఇకపై పెద్ద కంపెనీలకు ప్రాజెక్టులు ఇచ్చే బదులు, ఇలాంటి ఏఐ టూల్స్‌తోనే పని పూర్తి చేసుకుంటారనే ఆందోళన ఐటీ స్టాక్స్‌ను అమ్మకాల ఒత్తిడిలోకి నెట్టింది.