భారత్-చైనా మధ్య 155 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యం

భారత్-చైనా మధ్య 155 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యం

భారత్​, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య రికార్డు స్థాయికి చేరుకుంది. 2025లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 155.6 బిలియన్ డాలర్లకు చేరుకుందని భారత్​లోని చైనా దౌత్యవేత్త షు ఫియాంగో వెల్లడించారు. ఇది గతేడాదితో పోలిస్తే 12 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన చైనా నూతన సంవత్సరం వేడుకల్లో ఈ మేరకు తెలిపారు.

“గత ఆగస్టులో టియాంజిన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాలు కొత్త మెరుగదల స్థాయికి మారాయి. రాజకీయ విశ్వాసం, ఆర్థిక సహకారం రెండూ బలపడుతున్నాయి. 2025లో భారత్–చైనా వాణిజ్యం 155.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సంవత్సరానికి 12 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. చైనాకు భారతదేశ ఎగుమతులు 9.7 శాతం పెరిగాయి. ఇది ఇరు దేశాల మధ్య భారీ వాణిజ్య, ఆర్థిక సహకార అవకాశాలను సూచిస్తోంది” అని షు ఫియాంగో తెలిపారు.

కాగా, భారత యాత్రికుల కోసం టిబెట్ (షిజాంగ్)లో పవిత్ర పర్వతం సరస్సు యాత్ర తిరిగి ప్రారంభించిందని షు ఫియాంగో వెల్లడించారు. గతేడాదిలో దాదాపు 20 వేల మంది భారతీయులు పాల్గొన్నారు తెలిపారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య నేరుగా అనేక విమాన సర్వీసులు ప్రారంభించినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విమానాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అందుకోసం వివిధ స్థాయిలో చర్చలు జరుగుతన్నట్లు చెప్పారు.

“భారత్​కు ఎక్కువమంది చైనా పర్యటకులు రావాలని నేను కోరుకుంటున్నా. భారత్​, చైనా వీసా పరిమితులను సడలించడం చూసి నేను సంతోషంగా ఉన్నా. దీంతో ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా. నేను పర్యటక శాఖ మంత్రిని కలిసి, మన ద్వైపాక్షిక సంబంధాలను ఎలా బలోపేతం చేసుకోవాలో చర్చించాం. భారత్, చైనా ప్రజలలో అవగాహన పెంచడానికి పర్యాటక రంగ సంస్థలను భారతదేశానికి రావాలని ఆహ్వానించడం వంటి పర్యాటక ప్రోత్సాహాన్ని మేము నిర్వహించనున్నాం” అని ఆయన వివరించారు.

‘ప్రపంచ మహా సామరస్యం’ అనే చైనా దృక్పథం, ‘వసుధైక కుటుంబకం’ అనే భారత తత్వంతో సారూప్యత కలిగి ఉందని రాయాబారి షూ ఫియాంగో తెలిపారు. చైనా స్వావలంబన, ఆత్మనిర్భర్ భారత్ రెండూ ఒకే తాత్విక మూలాలున్న దారులని వ్యాఖ్యానించారు. ఇక తాను అజంతా–ఎల్లోరా గుహలు, శాంతినికేతన్ సందర్శించినప్పుడు రెండు నాగరికతల మధ్య లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుసంధానం అనుభూతి చెందానని రాయబారి తెలిపారు. ఇరు దేశాలు సంభాషణ, పరస్పర విశ్వాసం, ఆర్థిక సహకారంతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని షూ ఫియాంగో ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్రిక్స్‌కు రొటేటింగ్ ఛైర్​గా భారత్ పాత్రకు పూర్తి మద్దతు ప్రకటించారు రాయబారి షూ ఫియాంగో. గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌తో మరింత సమన్వయంతో పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మన సంప్రదాయ సంస్కృతుల నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తూ, చైనా-భారత్ పరస్పర సహకార భాగస్వాములు అని తెలిపారు. పరస్పర అభివృద్ధి అవకాశాలనే ఏకాభిప్రాయాన్ని కాపాడేందుకు భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని షూ ఫియాంగో పేర్కొన్నారు.

వసంత ప్రారంభాన్ని సూచించే లిచున్ పర్వదినానికి ముందు రోజు చైనా ప్రజలు నూతన సంతవ్సరంగా జరుపుకుంటారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాల దౌత్యవేత్తలు, చైనా ప్రవాస సమాజ ప్రతినిధులు, వ్యాపార, విద్యా, సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.