డాలర్‌ కోటను బద్దలు కొట్టేందుకు చైనా సరికొత్త వ్యూహం

డాలర్‌ కోటను బద్దలు కొట్టేందుకు చైనా సరికొత్త వ్యూహం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్‌ కోటను బద్దలుకొట్టడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సరికొత్త వ్యూహరచన చేస్తున్నారు. చైనా కరెన్సీ అయిన ‘యువాన్‌’ను అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ‘బలమైన కరెన్సీ’గా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.  డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే కాకుండా, యువాన్‌ను ‘గ్లోబల్‌ రిజర్వ్‌ కరెన్సీ’గా మార్చడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారిక పత్రిక ‘కియుషి’లో ప్రచురితమైన ఒక వ్యాసంలో జిన్‌పింగ్‌ ఈ విషయాలను వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య మార్కెట్లలో యువాన్‌ వాడకాన్ని భారీగా పెంచాలని ఆయన సూచించారు. చైనాను ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా మార్చడానికి ‘బలమైన కరెన్సీ’ అత్యవసరమని తేల్చిచెప్పారు. 

”ప్రపంచంలో బ్యాంకింగ్‌ ఆస్తులు, విదేశీ మారక నిల్వలు, క్యాపిటల్‌ మార్కెట్‌ పరిమాణంలో చైనా అగ్రగామిగా ఉంది. మనది చాలా పెద్ద దేశం. కానీ ఆర్థికంగా ఇంకా ‘బలమైన’ దేశంగా మారాలి. చైనాను నిజమైన ఫైనాన్షియల్‌ పవర్‌ హౌస్‌గా మార్చడం అనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ” అని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి చైనా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తోంది.

అంతర్జాతీయ బ్యాంకింగ్‌ లావాదేవీల నెట్‌వర్క్‌ ‘స్విఫ్ట్‌’ అమెరికా గుప్పెట్లో ఉంది. దీనికి పోటీగా చైనా, రష్యాలు కలిసి ‘సిప్స్‌’ (సీఐపీఎస్‌- క్రాస్‌-బోర్డర్‌ ఇంటర్బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టం)ను ప్రోత్సహిస్తున్నాయి.  రష్యా నుంచి ఆయిల్‌, గ్యాస్‌ కొనుగోలులో చైనా ఇప్పుడు యువాన్‌నే వాడుతోంది. గత ఏడాది చైనా తన మొత్తం 6.2 ట్రిలియన్‌ డాలర్ల విదేశీ వాణిజ్యంలో, దాదాపు మూడో వంతు వాణిజ్యాన్ని సొంత కరెన్సీలోనే జరిపింది. చైనా తన కరెన్సీని ప్రపంచవ్యాప్తం చేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. 

స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇప్పటికే 50 దేశాలతో చైనా ‘కరెన్సీ స్వాప్‌’ ఒప్పందాలు కుదుర్చుకుంది. యువాన్‌ విలువను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, యువాన్‌ విలువ ఇంకా డాలర్‌తో పోలిస్తే 25 శాతం తక్కువగానే ట్రేడ్‌ అవుతోంది. బీజింగ్‌, మాస్కోలు ఇప్పుడు ‘బ్రిక్స్‌’ వేదికగా డాలర్‌కు చెక్‌ పెట్టాలని చూస్తున్నాయి. 10 దేశాల కూటమిగా మారిన బ్రిక్స్‌, ఉమ్మడి కరెన్సీని లేదా ‘బ్రిక్స్‌ పే’ సిస్టమ్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.

ఈ ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, డాలర్‌ ఆధిపత్యాన్ని సవాలు చేస్తే బ్రిక్స్‌ దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు.  పాశ్చాత్య దేశాల ఆర్థిక నమూనాకు భిన్నంగా చైనా నమూనా ఉంటుందని జిన్‌పింగ్‌ తెలిపారు.