“అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ ముందుకొస్తుంది.సుమారు 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇంధన, సాంకేతిక, వ్యవసాయ, బొగ్గు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు” అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌పై టారిఫ్‌లు తగ్గించినందుకు ట్రంప్‌నకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత తయారీ రంగానికి, ఎగుమతులకు ఇది ఊతమిస్తుందని చెప్పారు.
రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య ఈ ఒప్పందం ఇరుదేశాల ప్రజలకు అనేక అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరతకు ట్రంప్ నాయకత్వం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అంతకుముందు ట్రంప్-ప్రధాని మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. అయితే ఇరువురు నేతల మధ్య ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘వేచి చూడండి..’ అనే సందేశాన్ని సెర్గియో గోర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీ హర్షం
ట్రంప్ ఫోన్ కాల్‌పై ప్రధాని మోదీ కూడా ‘ఎక్స్’లో స్పందించారు. ట్రంప్‌తో సంభాషణ అత్యంత ఆకర్షణీయంగా సాగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. . “ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్ కు పెద్ద ధన్యవాదాలు” అని, ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని మోదీ తెలిపారు.
రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం కీలకం అని ప్రధాని మోదీ అన్నారు.”మేడిన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించడం అద్భుత నిర్ణయం. భారత్, అమెరికా సహకారం రెండు దేశాలకు ఎంతో ప్రయోజనకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్ తో కలిసి పని చేయాలని ఆశిస్తున్నా. ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయి” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
భారత ఎగుమతులపై ట్రంప్ భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య అమెరికా రాయబారి ఈ పోస్టు పెట్టడం గమనార్హం. అంతేకాదు భారత ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే ట్రంప్, మోదీతో మాట్లాడడం విశేషం. భారత వస్తువులపై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌ల వల్ల ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో కొన్ని చర్యలను ప్రతిపాదించడం జరిగింది.
మరోవైపు భారత్‌లోని చారిత్రక కట్టడం ఇండియా గేట్ ఫొటోను ట్రంప్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ‘భారతదేశపు సుందరమైన విజయస్మారకం ఇది. మనది అన్నింటికన్నా గొప్పగా ఉండబోతున్నది’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, వాషింగ్టన్ డీసీలో భారీ కట్టడాన్ని నిర్మించాలని ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

More Stories
క్రికెట్ బహిష్కరణతో పాక్ వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ!
ఆర్మీ మాజీ చీఫ్ పుస్తక ప్రస్తావనతో లోక్ సభలో గందరగోళం
దివ్యాంగులకు సులభతరంగా సర్టిఫికేట్ లు ఇవ్వాలి