భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం

భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం
 
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఈ శతాబ్దపు అతి పెద్ద ఒప్పందంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆ ఒప్పందం ప్రపంచ వేదికపై భారత్​కు పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని తెలిపారు. మంగళవారం ఎన్​డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ఇరు దేశాల పరస్పర సుంకాలు ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయని వెల్లడించారు.

“భారత్​ ఇప్పుడు ప్రపంచ వ్యవహారాల్లో కీలక శక్తిగా ఎదుగుతోంది. గ్లోబల్ సమతుల్యతను కాపాడడంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. భారత్ ప్రపంచ వేదికపై నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం ఈ శతాబ్దపు అతిపెద్ద ఈవెంట్. ట్రంప్‌ విధించిన సుంకాలపై ప్రజలు మమ్మల్ని విమర్శించారు. అయినా సహనంతో ఉన్నాం. అదే ఇప్పుడు గెలిపించింది” అని చెప్పారు. 

 
“ఈ ఒప్పందం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించింది. వాణిజ్య చర్చల పట్ల ప్రభుత్వ స్థిరమైన వైఖరికి ఇది నిదర్శనం. ఇది భారత ఎగుమతులు, పెట్టుబడులు, పరిశ్రమలకు కొత్త అవకాశాలు తెస్తుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ కేంద్ర బడ్జెట్ 2026ను రాబోయే 25 సంవత్సరాల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ ఉద్దేశాలు, దీర్ఘకాలిక లక్ష్యాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఎన్‌డీఏ ఎంపీలకు ప్రధాని సూచించారు.
బడ్జెట్‌లోని ప్రాధాన్యాంశాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ఎంపీల బాధ్యత అని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా అనేక చిన్న పార్టీలూ ఎన్‌డీఏతో చేతులు కలుపుతున్నాయని ప్రధాని చెప్పారు. ఇప్పుడు ఎన్‌డీఏతో కలిసిన పార్టీల సంఖ్య 50 శాతానికి మించిపోయిందని తెలిపారు. ఇది దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఎన్​డీఏ రాజకీయ దృక్పథానికి పెరుగుతున్న ఆదరణను చూపిస్తోందని పేర్కొన్నారు. 
 
అంతకుముందు భారత్ -అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రధాని నరేంద్ర మోదీని కేంద్రమంత్రులు, ఎంపీలు సత్కరించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బీజేపీ, టీడీపీ, జేడీయూ, ఎల్​జేపీఆర్ శివసేన, జేడీఎస్ సహా ఎన్​డీఏలోని ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. రాజకీయం, పాలనాపరమైన అంశాలు సహా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఇటీవలే భారత్ తొమ్మిది వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్ టి ఏలు) పూర్తి చేసిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ప్రధాని నాయకత్వంలో చారిత్రక వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, 39 అభివృద్ధి చెందిన దేశాలతో ఎఫ్‌టీఏలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇది దేశానికి చారిత్రక ఘట్టమని చెప్పారు.