సుంకాల తగ్గింపుతో ఆసియా ఎగుమతుల్లో భారత్‌ ఆధిపత్యం

సుంకాల తగ్గింపుతో ఆసియా ఎగుమతుల్లో భారత్‌ ఆధిపత్యం

* బంగ్లాదేశ్, చైనా, పాక్‌లకు భారీ దెబ్బ

ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఒప్పందానికి ఎట్టకేలకు తెరపడటంతో ఆసియా ఎగమతి మార్కెట్‌లో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు 50శాతం టారిఫ్‌లతో ఎగుమతుల్లో అమెరికా మార్కెట్‌కు దూరంగా భారత్, సుంకాల తగ్గింపుతో ముందంజలోకి దుసుకొచ్చింది.

అమెరికా సవరించిన టారిఫ్‌లతో భారతీయ ఎగుమతిదారులకు ఏకంగా 32 శాతం పన్ను భారం తగ్గింది. భారత్ ఆసియా ఎగుమతి మార్కెట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో ప్రాంతీయ ప్రత్యర్థులైన చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. ఈ ఒప్పందం ముందు వరకు ఆసియాలోనే భారీగా అమెరికా టారిఫ్‌లను ఎదుర్కొన్న దేశం భారత్. ఒక్కరాత్రిలో అది తలకిందులైంది. 

ఇప్పుడు 18శాతంతో అతి తక్కువ సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాలో టాప్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌పై 19శాతం, శ్రీలంక‌పై 20శాతం, బంగ్లాదేశ్‌పై 20శాతం, వియత్నాంపై 20శాతం, ఇండోనేషియా, మలేసియా, థాయ్‌లాండ్‌పై 19శాతం చొప్పున, చైనాపై 34శాతం సుంకాలు అమల్లోకి ఉన్నాయి.  చైనాపై భారత్ కంటే దాదాపు రెట్టింపు టారిఫ్‌లు అమల్లో ఉండటం గమనార్హం.

అయితే ఆసియాలో అఫ్గానిస్థాన్‌ ఒక్కటే భారత్ కంటే తక్కువ టారిఫ్‌లు 15శాతం ఎదర్కొంటోంది. కానీ, ఆసియా ఎగుమతి మార్కెట్‌లో అఫ్గానిస్థాన్ భారత్‌కు ఏ మాత్రం పోటీ కాదు. టారిఫ్‌ల తగ్గింపుతో అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు చౌకగా లభించి, ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, పాదరక్షల వంటి కీలక రంగాలలో వియత్నాం, బంగ్లాదేశ్‌లతో పోటీ పడుతున్న భారతీయ కంపెనీలకు భారీ ఊరట కలగనుంది. 

టెక్స్‌టైల్స్, జెమ్స్, జ్యువెలరీ, ఫార్మా రంగాలు అమెరికా మార్కెట్‌లో మరింత పోటీనిస్తాయి. సుంకాల సవరింపు తర్వాత ఆసియా ఎగుమతి మార్కెట్‌లో చైనాతో పోలిస్తే భారత్ ఇప్పుడు చాలా బలీయమైన స్థితిలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి భారత్‌కు మార్చేలా ప్రోత్సహిస్తుంది.  భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై ఉన్న సుంకాలను, అడ్డంకులను తొలగించి, ‘జీరో’ స్థాయికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్న నేపథ్యంలో ఇరు దేశాల వాణిజ్యం కొత్త పుంతల తొక్కనుంది.