ఆర్మీ మాజీ చీఫ్ పుస్తక ప్రస్తావనతో లోక్ సభలో గందరగోళం

ఆర్మీ మాజీ చీఫ్  పుస్తక ప్రస్తావనతో లోక్ సభలో గందరగోళం
2020లో భారత్-చైనా మధ్య నెలకొన్న లద్దాఖ్ ప్రతిష్టంభనపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన ఇంకా ముద్రించని ఓ పుస్తకానికి సంబంధించి ఒక మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని కాంగ్రెస్ ఎంపీ, విపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించడంతో గందరళగోళం ఏర్పడింది. రాహుల్ ప్రస్తావిస్తున్న పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఆ పుస్తకం ప్రచురితమైందా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని రాహుల్‌ను రాజ్‌నాథ్ కోరారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ వేళ సభలో గందరగోళం ఏర్పడింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని మాజీ ఆర్మీ చీఫ్‌ నరవణే తన పుస్తకంలో రాసుకొచ్చిన అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది. వాటిని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ రాహుల్‌ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. 

దీంతో రాహుల్ ప్రసంగాన్ని రాజ్‌నాథ్ సింగ్ అడ్డుకున్నారు. రాహుల్ ప్రచురించని పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ఆ పుస్తకం ప్రామాణీకతను ప్రశ్నించారు.  రాజ్‌నాథ్ సింగ్ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమర్థించారు. ‘మ్యాగజైన్‌ ఏదైనా రాయవచ్చు. పుస్తకం అధికారికంగా ప్రచురితం కానప్పడు దానికి విశ్వసనీయత ఉండదు’ అని పేర్కొన్నారు. 

విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాహుల్ మాట్లాడటం సరికాదని చెబుతూ పార్లమెంటరీ విధివిధానాలను పాటించాలని సూచించారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని ఆ పుస్తకం ఎక్కడుందో చూపించాలని అడిగారు. ప్రతిపక్ష నేతగా మీరు ఆరోపణలు చేస్తున్నారే కానీ సభ నిబంధనలను పాటించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. 

దీంతో రాహుల్ వెంటనే  ‘ఏమి మాట్లాడమంటారో దయచేసి మీరే చెప్పండి’ అని అడిగారు. దీనిపై స్పీకర్ వెంటనే “నేను మీ సలహాదారుని కాదు. స్పీకర్‌గా సభ సజావుగా సాగేలా చూడటం నా బాధ్యత. నిర్దేశించిన సబ్జెక్ట్‌ మీదే చర్చ ఉండాలి” అని చెప్పారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాను ఈ ప్రత్యేక విషయంపై మాట్లాడాలని ఎప్పుడూ అనుకోలేదని, అయితే బీజేపీకి చెందిన ఎంపీ తేజస్వీ సూర్య కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని ప్రశ్నించిన తర్వాత తాను ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించుకున్నానని రాహుల్ గాంధీ తెలిపారు.

“నేను సభలో ప్రస్తావించినవి డోక్లాంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించవి. నాలుగు చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించి ఒక పర్వత శ్రేణిని ఆక్రమిస్తున్నాయి. ఈ విషయాన్ని మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే ఆత్మకథ ఆధారంగా ఓ మ్యాగజైన్ తన కథనంలో ఊదహరించింది. ఆ కథనంలోని అంశాలనే నేను సభలో ఉటంకించాను. అవి మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను”అని రాహుల్ వ్యాఖ్యానించారు. 

 
అలాగే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. చైనాకు సంబంధించిన విషయం చాలా సున్నితమైనదని, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడటానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.  వార్తాపత్రికల క్లిప్పింగులు, ప్రచురణ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్‌సభలో ప్రస్తావించకూడదని స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 
 
సభలో చర్చలు నిబంధనల ప్రకారం జరగాలని పేర్కొంటూ లోక్‌సభలో స్పీకర్ ఆదేశాలను పాటించని సభ్యుడిపై ఏ చర్యలు తీసుకోవాలో కూడా సభలో చర్చించాలని పేర్కొన్నారు. అలాగే సభా కార్యకలాపాలకు సంబంధం లేని ఏ బుక్ లేదా వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను సభలో ఉటంకించకూడదని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఈ క్రమంలో రూల్ బుక్‌లోని నిబంధనలను చదివి వినిపించారు. అయితే విపక్షాల గందరళగోళం నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం నాలుగు గంటలకు వాయిదా వేశారు.