సింధూ జలాల ఒప్పందంపై మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తెలిపిన వేళ, భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విచారణలో తాము పాల్గొనబోమని స్పష్టం చేసింది. భారత్- పాకిస్థాన్ సింధు జలాల ఒప్పందానికి (ఐడబ్ల్యుటి) సంబంధించి కొత్త విచారణలు, ఆదేశాలతో హేగ్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్ట్ (సిఓఏ) ముందుకు సాగుతున్న వేళ, ఈ విచారణల చట్టబద్ధతను గుర్తించబోమని భారత్ తేల్చిచెప్పింది.
జల విద్యుత్ కేంద్రాల కార్యాచరణ పాండేజ్ లాగ్‌బుక్‌లను సమర్పించాలని వారం క్రితం సిఓఏ భారత్‌కు తెలిపింది. ఫిబ్రవరి 2-3 తేదీల్లో ఈ కేసును విచారిస్తామని కోర్టు తెలిపింది. భారత్ ఇంతవరకు ఎలాంటి ప్రతివాద నివేదికను దాఖలు చేయలేదని పేర్కొంది. అయితే, సిఓఏ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది.
చట్టవిరుద్ధంగా ఏర్పాటైన సిఓఏ అసంబద్ధమైన విచారణలను కొనసాగిస్తోందని పేర్కొంది. దాని చట్టబద్ధతను తాము గుర్తించనందున, దాని ఆదేశాలపై స్పందించబోమని తేల్చిచెప్పింది. పైగా, ఐడబ్ల్యుటిని నిలిపివేసినందున భారత్ స్పందించాల్సిన అవసరమే లేదని స్పష్టంచేసింది. మరోవైపు సింధూ జలాల ఒప్పందం విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.
“మా ప్రాంతంలో నీటి భద్రత బాధ్యతాయుతమైన, చట్టబద్ధమైన సరిహద్దు సహకారంపై ఆధారపడి ఉంటుంది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని ప్రభావితం చేసే భారత ఏకపక్ష చర్యలపై పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. నీటిని ఎప్పుడూ బలవంతపు సాధనంగా ఉపయోగించకూడదు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా యుద్ధ సాధనంగా నీటిని ఉపయోగించడాన్ని ఆపివేయాలి. ఎందుకంటే నదీ ప్రవాహాల అంతరాయం సింధు బేసిన్‌పై ఆధారపడిన దేశంలో లక్షలాది మంది జీవితాలు, జీవనోపాధి, ఆహార వ్యవస్థలను దెబ్బతీస్తుంది” అని తెలిపారు.
గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్. అందులో భాగంగానే 1960 పాకిస్థాన్‌కు జలాలను తరలించే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేస్తూ నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని వెల్లడించింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్ తన సార్వభౌమ హక్కును ఉపయోగించుకుంది.

More Stories
కాల్పుల విరమణతో తెరుచుకున్న రఫా సరిహద్దు
బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో మహిళా సూసైడ్ బాంబర్లు
90 ఏళ్ళ వయస్సులో దలైలామాకి గ్రామీ అవార్డ్