అస్సాం నుండి బతుకు తెరువు కోసం కర్ణాటకకు వచ్చి పనిచేసుకుంటున్న నలుగురు వలస కార్మికులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు నగర శివార్లలోని హోస్కోట్ తాలూకా ముత్తసంద్ర గ్రామంలోని లేబర్ షెడ్లో శనివారం ఉదయం వారు మరణించి వుండగా కనుగొన్నారు. వారిని జయంత్ సింథె (25), నీరేంద్రనాథ్ (24), డాక్టర్ టైడ్(25), ధనంజరు టైడ్(20)గా గుర్తించారు.
శీతల పానీయాల గిడ్డంగిలో ఈ నలుగురు పనిచేస్తున్నారు. వారు పనిచేసే ప్రదేశానికి దగ్గర్లోనే గల లేబర్ షెడ్లో నివసిస్తున్నారు. సంఘటన సమయంలో వారు షెడ్ లోపల నిద్రపోతున్నారని పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అక్కడున్న దయనీయమైన పరిస్థితుల కారణంగా గాలి చొరబడ్డానికి వీల్లేని స్థితిలో వారు ఊపిరాడక చనిపోయినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు.
శుక్రవారం రాత్రి కార్మికులు అన్ని తలుపులు, కిటికీలు వేసి షెడ్ లోపల ఆహారం వండుకున్నారని పోలీసులు తెలిపారు. బహుశా షెడ్లో వెంటిలేషన్ సరిగా లేకపోవడం వల్ల ఆక్సిజన్ హరించుకుపోవడమో లేదా విషపూరితమైన వాయువులను పీల్చడమో జరిగి వుండవచ్చని, ఫలితంగా వారు మరణించి వుండవచ్చని అనుమానిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఈ దశలో ఇతర కారణాలనూ తోసిపుచ్చలేమని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం ఆ నలుగురూ విధులకు హాజరు కాకపోవడంతో మిగిలిన వారు వచ్చి చూడడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న వెంటనే సులిబెలె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షెడ్ లోపల స్పృహ కోల్పోయి పడి వున్న ఆ నలుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు మరణించినట్లు ప్రకటించారు.
పోస్టుమార్టం తర్వాత, ఫోరెన్సిక్ నివేదికల తర్వాత అసలుకారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. సహచర కార్మికులు, గిడ్డంగి యాజమాన్య సిబ్బంది, కాంట్రాక్టర్ల స్టేట్మెంట్లను నమోదు చేశారు. అసహజ మరణంగా సులిబెలె పోలీసులు కేసు నమోదు చేశారు. కార్మికులకు సరైన వసతి సదుపాయాలు కల్పించకుండా యజమానులు లేదా కాంట్రాక్టుల తరపున నిర్లక్ష్యం జరిగిందా అనే రీతిలో కూడా దర్యాప్తు సాగుతోంది.
ఈ సంఘటనతో సమీప పారిశ్రామిక యూనిట్లలో పనిచేసే వలస కార్మికుల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. కాంట్రాక్టు కార్మికుల పరిస్థితులు అత్యంత దయనీయంగా వుంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడుండే లేబర్ షెడ్ల్లో చాలావరకు మౌలికమైన భద్రతా సదుపాయలేవీ కూడా వుండవన్నారు.
గాలి, వెలుతురు ధారాళంగా రావని, అగ్ని ప్రమాదాలు జరిగితే వుండే భద్రతా ఏర్పాట్లు కూడా వుండవని చెప్పారు. కాంట్రాక్టర్లు, యజమానులు లాభాల గురించి తప్ప కార్మికులకు కనీస వసతులను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Stories
ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి!
5-6 తేదీల్లో బంగాళాఖాతం మీదుగా ‘నోటమ్’ జారీ
‘నిఫా’ వ్యాప్తి చెందే అవకాశం తక్కువే