భారతదేశ విదేశీ మారక నిల్వలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. జనవరి 23తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు రూ.73వేల కోట్లు (8.053 బిలియన్ డాలర్లు) మేర పెరిగి రికార్డు స్థాయిలో రూ.65 లక్షల కోట్ల (709.413 బిలియన్ డాలర్ల)కు చేరాయి. దేశ ఖజానాలో బంగారం, విదేశీ కరెన్సీ నిల్వలు పెరగడంతో ఈ ఆశాజనక పురోగతి చోటుచేసుకుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా నివేదికలో ఈవివరాలను ప్రస్తావించారు. ప్రత్యేకించి గత కొన్ని వారాల వ్యవధిలోనే భారత ఖజానాలోని విదేశీ కరెన్సీ నిల్వలు (డాలర్, యూరో, పౌండ్, యెన్, రూబుల్ వంటివి) భారీగా పెరిగాయని ఆర్‌బీఐ నివేదికలో పేర్కొన్నారు.
జనవరి 23తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ నిల్వలు రూ.21వేల కోట్లు (2.367 బిలియన్ డాలర్లు) మేర పెరిగి రూ.51 లక్షల కోట్ల (562.885 బిలియన్ డాలర్ల)కు చేరాయి. అంతక్రితం వారంతో పోలిస్తే, జనవరి 23తో ముగిసిన వారంలో భారత ఖజానాలోని బంగారం నిల్వలు సైతం రూ.51వేల కోట్లు (5.635 బిలియన్ డాలర్లు) మేర పెరిగి, రూ.11 లక్షల కోట్ల (123.088 బిలియన్ డాలర్ల)కు చేరాయి.
భారతదేశ విదేశీ మారక నిల్వలు చివరిసారిగా 2024 సెప్టెంబరులో రూ.64 లక్షల కోట్ల (704.89 బిలియన్ డాలర్ల) గరిష్ట స్థాయికి పెరిగాయి. 16 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు భారత ఫారెక్స్ నిల్వలు రూ.65 లక్షల కోట్ల స్థాయిని చేరాయి. 2022లో భారత్ విదేశీ మారక నిల్వలు ఏకంగా రూ.6.50 లక్షల కోట్లు (71 బిలియన్ డాలర్లు) తగ్గిపోయాయి. కానీ 2023 నుంచి లెక్క మారిపోయింది.
భారత్ విదేశీ మారక నిల్వలు 2023లో రూ.5.31 లక్షల కోట్లు (58 బిలియన్ డాలర్లు), 2024లో రూ.1.83 లక్షల కోట్లు (20 బిలియన్ డాలర్లు), 2025లో రూ.5.13 లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) చొప్పున పెరిగాయి. 2025 డిసెంబరు నెల ప్రారంభంలో ద్రవ్య విధాన సమీక్షను నిర్వహించిన అనంతరం ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో కీలక అంశాలను ప్రస్తావించింది.
దాదాపు 11 నెలల పాటు విదేశీ వాణిజ్యం చేసేందుకు సరిపడా విదేశీ కరెన్సీ నిల్వలు భారత్ వద్ద సిద్ధంగా ఉన్నాయని అప్పట్లో ఆర్‌బీఐ వెల్లడించింది. విదేశీ వాణిజ్యం, అంతర్జాతీయ లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు, రుణాలు, విదేశీ మారక నిల్వల విషయంలో భారత్ బలంగా ఉందని స్పష్టం చేసింది. విదేశీ వాణిజ్య వ్యవహారాలను సునాయాసంగా చక్కబెట్టేందుకు తగినన్ని ఆర్థిక వనరులు సిద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది.

More Stories
శబరిమల బంగారం దోపిడీ కేసులో నటుడు జయరామ్ వాంగ్మూలం
భారత్- ఈయూ ఒప్పందంపై అప్పట్లో అడ్డంకిగా జైరాం రమేష్!
గరిష్ట స్థాయికి చేరి ఒకేసారి పడిపోయిన బంగారం, వెండి ధరలు