భారత్- ఈయూ ఒప్పందంపై అప్పట్లో అడ్డంకిగా జైరాం రమేష్!

భారత్- ఈయూ ఒప్పందంపై అప్పట్లో అడ్డంకిగా జైరాం రమేష్!

భారత్ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఖరారైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై  కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఎఫ్‌టీఏపై 2006లో ఈయూతో చర్చలను మొదలుపెట్టిన నాటి కాంగ్రెస్ సర్కారు ఎలాంటి ఫలితాన్ని సాధించలేకపోయిందని పీయూష్ గోయల్ తెలిపారు.

అప్పట్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హోదాలో జైరాం రమేశ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి పెను ఆటంకంగా నిలిచారని ఆయన ఆరోపించారు. ఈయూతో ఎఫ్‌టీఏను ఖరారు చేసుకునే చొరవను, సాహసాన్ని నాటి కాంగ్రెస్ సర్కారు చూపలేకపోయిందని ఆయన మండిపడ్డారు. కానీ తాజాగా ఈయూతో మోదీ సర్కారు ఎఫ్‌టీఏను ఖరారు చేసుకోవడాన్ని చూసి ఓర్వలేక, అందని ద్రాక్ష పుల్లన అనేలా జైరాం రమేశ్ మాట్లాడారని ధ్వజమెత్తారు. 

గతంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా చైనాతో ఎఫ్‌టీఏ కోసం పాకులాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు. సొంతదేశాన్ని కించపరిచేలా మాట్లాడే రాహుల్ గాంధీ, జైరాం రమేశ్ లాంటి నేతలు భారత్‌లో ఉండటం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.

“ట్రేడ్ డీల్‌పై 2006లో ఈయూతో చర్చలను మొదలుపెట్టిన నాటి కాంగ్రెస్ సర్కారు, 2013లో వాటిని ఆపేసింది. చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిసినా, ఆ ఒప్పందం దిశగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఇచ్చారు?” అని పీయూష్ గోయల్ ప్రశ్నించారు.

“భారత తయారీ రంగ సంస్థలతో పోటీ పడే దేశాలతో కానీ, భారత తయారీరంగ సంస్థల కంటే తక్కువ కార్మిక వ్యయాలను కలిగిన సంస్థలున్న దేశాలతో కానీ ఎఫ్‌టీఏను కుదుర్చుకునే ప్రసక్తే లేదు. చైనాలాంటి దేశంతో ఎఫ్‌టీఏను కుదుర్చుకుంటే, భారత్‌లోని తయారీరంగ సంస్థలకు గడ్డుకాలం ఎదురవుతుంది. ఈ అంశాలు తెలిసినా జపాన్, దక్షిణ కొరియాలతో గతంలో కాంగ్రెస్ సర్కారు ఎఫ్‌టీఏలను కుదుర్చుకుంది” అని విమర్శించారు. 

దీనివల్ల భారత్‌కు ఆ రెండు దేశాల దిగుమతులు రెట్టింపు అయ్యాయని, కానీ మనదేశం నుంచి ఆ దేశాలకు వస్తు, ఉత్పత్తులు తగినంత చేరలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. దేశ పురోగతిని నిరోధించే ప్రణాళికలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దగ్గరున్నాయని ఎద్దేవా చేశారు.

భారత్‌లో వాహనాల తయారీని లాభదాయక వ్యవహారంగా ఈయూ దేశాల కంపెనీలు భావిస్తున్నాయి. దీనివల్ల మనదేశంలో కొత్తగా పెద్దసంఖ్యలో ఉద్యోగాలు ఏర్పడతాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లోని దేశీయ కార్ల మార్కెట్‌ను మేం కాపాడుకుంటాం. గరిష్ఠంగా రూ.30 లక్షల దాకా ధర పలికే కార్ల కేటగిరీలలోకి ఈయూ వాహన కంపెనీలకు అనుమతిని ఇవ్వబోం” అని గోయల్ స్పష్టం చేశారు. 

“ఈయూ దేశాల లగ్జరీ కార్లకు మాత్రమే అనుమతి ఇస్తాం. ఒకవేళ వాటి సేల్స్ జరిగితే, మనదేశంలోనే కార్ల తయారీని అవి మొదలుపెడతాయి. ఈయూతో ఎఫ్‌టీఏ భారతదేశ వస్త్ర తయారీ రంగానికి భారీ ఊతమిస్తుంది. దేశ వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. ట్రేడ్ డీల్‌లో భాగంగా వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదలను అరికట్టేందుకు భారత్‌కు ఈయూ ఆర్థిక చేయూతను అందించబోతోంది” అని తెలిపారు. 

భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వస్తు,ఉత్పత్తులపై ఈయూ దేశాలు కార్బన్ ట్యాక్స్ విధిస్తున్నాయని చెబుతూ ఈ ట్యాక్స్‌లో భారత్‌కు రాయితీ లభించనుందని పీయుష్ గోయల్ చెప్పారు. భారత్‌తో ట్రేడ్ డీల్‌ను మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా ఈయూ అభివర్ణించింది. తదుపరిగా అమెరికా లాంటి దేశాలతోనూ డీల్స్‌ను ఖరారు చేసుకోవాలని భావిస్తున్నాం. చిలీతో ఎఫ్‌టీఏపై చర్చలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. కెనడా, అమెరికాతోనూ మా సంప్రదింపులు కొనసాగుతున్నాయి” అని ఆయన వెల్లడించారు. 

త్వరలోనే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లోని 6 దేశాలతోనూ ఎఫ్‌టీఏపై చర్చలను మొదలుపెడతామని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ యవనికలో అత్యుత్తమ స్థాయిలో భారత్ ఉందని పేర్కొంటూ శరవేగంగా వికసిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ దేశాలకు ఆసక్తి పెరుగుతోందని ఆయన చెప్పారు. 2047లో వికసిత భారత్‌ను సాధించే దిశగా మోదీ సర్కారు పట్టుదలతో పనిచేస్తోందని పీయుష్ గోయల్ వెల్లడించారు.