విమాన ప్రమాదంలో మృతి చెందిన దివంగత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ శనివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవిని గతంలో ఆమె భర్త నిర్వహించారు. 62 ఏళ్ల సునేత్ర మహారాష్ట్రకు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా నిలిచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) శాసనసభాపక్ష నాయకురాలిగా సునేత్ర నియమితులైన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమక్షంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకలో “అజిత్ దాదా అమర్ రహే” అనే నినాదాలు హాలులో ప్రతిధ్వనించడంతో భావోద్వేగ వాతావరణం నెలకొంది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ దివంగత నాయకుడికి నివాళులర్పించడానికి, సునేత్ర పవార్ కొత్త బాధ్యతను స్వీకరిస్తున్న సందర్భంగా ఆమెకు సంఘీభావం తెలియజేయడానికి గుమిగూడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తన పదవీకాలాన్ని ప్రారంభించబోతున్న సునేత్ర పవార్ జీకి నా శుభాకాంక్షలు. ఈ బాధ్యతను చేపట్టిన తొలి మహిళ ఆమెనే. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆమె అవిశ్రాంతంగా కృషి చేస్తారని, దివంగత అజిత్‌దాదా పవార్ ఆశయాలను నెరవేరుస్తారని నేను విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో పాటు, సునేత్ర పవార్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్సైజ్, క్రీడల శాఖల బాధ్యతలను కూడా కొనసాగిస్తారు. గతంలో అజిత్ పవార్ నిర్వహించిన ఆర్థిక శాఖ బాధ్యతలు, మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున, తాత్కాలికంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉంటాయని తెలుస్తోంది. ఈ శాఖను తర్వాతి దశలో ఎన్‌సిపికి కేటాయించే అవకాశం ఉంది.
ముంబైలోని లోక్ భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన, ఎన్‌సిపి కూటమి అయిన మహా యుతికి చెందిన అగ్ర నాయకులు, మంత్రులందరూ హాజరయ్యారు. అయితే శరద్ పవర్, ఆయన కుమార్తె సుప్రియ సులే ప్రమాణస్వీకారంకు హాజరు కాలేదు. తొలుత సునేత్ర ఎన్సీపీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె శనివారం ఉదయం ముంబైలోని విధాన్ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సునేత్రా పవార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల వరకు సునేత్ర పవార్ పెద్దగా రాజకీయాలలో తలదూర్చలేదు. ఆ ఎన్నికలలో, ఆమె తన భర్త పార్టీ అభ్యర్థిగా బారామతి నుండి పోటీ చేసి, ప్రతిష్టాత్మక పోరులో తన తోటికోడలు, ప్రస్తుత ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపీ సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర మాజీ మంత్రి పద్మసింగ్ బాజీరావు పాటిల్ కుమార్తె అయిన సునేత్ర పవార్‌కు సామాజిక సేవ, పవార్ కుటుంబం ఆధిపత్యం వహించే సహకార రంగంలో నేపథ్యం ఉంది. ఆమె బయో-కెమిస్ట్రీలో పోస్ట్-గ్రాడ్యుయేట్.

More Stories
బంగాల్లో మమతా ప్రభుత్వం కూలిపోవడం ఖాయం
అమెరికాలో మరోసారి పాక్షిక షట్డౌన్
బ్రిక్స్ దేశాలను డిజిటల్ కరెన్సీలతో అనుసంధానం.. భారత్ యత్నం