భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ఫోన్లో సంభాషించారు. రానున్న కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు నిర్ణయించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న తర్వాత, భారత్-వెనెజువెలా అగ్రనేతల మధ్య జరిగిన మొదటి ఫోన్ కాల్ ఇదే కావడం గమనార్హం.
“వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు శ్రీమతి డెల్సీ రోడ్రిగ్జ్‌తో మాట్లాడాను. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి మేం అంగీకరించాం. రానున్న సంవత్సరాల్లో భారత్-వెనెజువెలా సంబంధాలను మరింత ఉన్నత స్థితికి చేర్చాలనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతాం” అని ఎక్స్ పోస్ట్ లో ప్రధాని మోదీ తెలిపారు.
2026 జనవరి 3వ తేదీన అమెరికా దళాలు నాటి వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్నాయి. తరువాత న్యూయార్క్‌లో ఆయనపై నార్కో టెర్రరిజం అభియోగాలు మోపారు. దీనితో జనవరి 5న డెల్సీ రోడ్రిగ్జ్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రధాని కార్యాలయం (పీఎంవో) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగం, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, వ్యవసాయం సహా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిశ్చయించుకున్నారు. ప్రాంతీయ, ప్రపంచ రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్న నేతలు, ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి) ప్రయోజనాల కోసం ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పారు.

More Stories
రివాల్వర్‌తో కాల్చుకుని కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ ఆత్మహత్య
గజనీ మహమ్మద్‌పై హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు
గవర్నర్ ఫోన్ ట్యాప్ చేస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం