వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్ల పాటు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. రూ.235 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తాల్లో సొమ్ము చేతులు మారినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చటంతో అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీ అధికారులు సిట్ నుంచి తాజాగా తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్టులు, ఇప్పటివరకూ దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర తదితర అంశాలపై సమాచారం తీసుకుని ఈడీ విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ చేసిన వ్యవహారంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమికంగా గుర్తించింది.
ఈ వ్యవహారంలో ఒకటి రెండు రోజుల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఆ వెంటనే కీలక నిందితులకు నోటీసులిచ్చి విచారించినున్నట్లు తెలుస్తోంది.
గత 2019-24 మధ్య ఐదేళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసి అందులో 59.71 లక్షల కిలోలను అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తమ సంస్థతో పాటు వైష్ణవి, ఏఆర్, మాల్గంగా డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసిన భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు ఈ అక్రమ కార్యకలాపాల కోసం విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, దిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లోని పలువురు హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బులు చెల్లింపులు, సొత్తు రూటింగ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
దానితో హవాలా ద్వారా ఎంత మొత్తం చెల్లించారు? సిట్ దర్యాప్తులో తేల్చినది కాకుండా ఇంకా ఎవరికైనా హవాలాలో చెల్లించారా? నాటి పాలకమండలి పెద్దలు, ఉన్నతాధికారులకు ఏమైనా సొత్తు అందిందా అనేది ఈడీ దర్యాప్తులో బట్టబయలయ్యే అవకాశముంది. టీటీడికి నెయ్యి సరఫరా చేసే టెండరు లభించేలా చేసినందుకు నాటి పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కె. చిన్నప్పన్నకు ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ఎండీ జగ్మోహన్ గుప్తా హవాలా మార్గాల్లో రూ.50 లక్షలు చెల్లించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
ఆ సొమ్ము మొత్తానికే లావాదేవీలు పరిమితమయ్యాయా? వారి మధ్య ఇంకా హవాలా లావాదేవీలు కొనసాగాయా అన్నది ఈడీ తేల్చే అవకాశముంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలాతో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బు ఏం చేశారు? ఎక్కడికి మళ్లించారు? అనేది ఈడీ దర్యాప్తులో తేలనుంది. 2019-24 మధ్య కాలంలో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు? అందుకు అవసరమైన నగదు ఎక్కడి నుంచి సమకూరింది? అనే వివరాల గుట్టు రట్టు చేసే అవకాశముంది. సిట్ విచారణలో బయటకు రాని వారి పేర్లు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి రావోచ్చని తెలుస్తోంది.
More Stories
బ్రిక్స్ దేశాలను డిజిటల్ కరెన్సీలతో అనుసంధానం.. భారత్ యత్నం
భారత్- ఈయూ ఒప్పందంపై అప్పట్లో అడ్డంకిగా జైరాం రమేష్!
గజనీ మహమ్మద్‌పై హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు