రివాల్వర్‌తో కాల్చుకుని కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ ఆత్మహత్య

రివాల్వర్‌తో కాల్చుకుని కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ ఆత్మహత్య
కేరళకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య సుకున్నారు. బెంగళూరులోని కాన్ఫిడెంట్‌ గ్రూప్‌పై ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడులకు భయపడి సీజే రాయ్‌, తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరు రిచ్‌మండ్‌ సర్కిల్‌లో ఉన్న ల్యాంగ్‌ఫర్డ్‌ రోడ్డులో ఈ సంఘటన జరిగింది.
గత రెండు నెలలుగా వరుసగా ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన కార్యాలయాల్లో సోదాలు చేబడుతున్నారు. ప్రస్తుతం మూడు రోజులుగా జరుగుతున్నాయి. ఆయనను వరుసగా ప్రశ్నిస్తున్నారు. మధ్యాన్నం 3 గంటల సమయంలో ఓ ఐదు నిముషాలపాటు తన ఆఫీస్ గదికి వెళ్లి వస్తాను అని లోపలకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది.   ఆయన తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
ఘటన సమయంలో ఆయన తన కార్యాలయంలో ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణం ఏంటనేది కానీ, సూసైడ్ నోట్ విషయం కానీ వెంటనే తెలియలేదు. వివరాల కోసం రాయ్ వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలికి చేరుకున్నారు.  ఆత్మహత్య కేసుగా రిజిస్టర్ చేసుకున్నామని, వాస్తవాలు వెల్లడయ్యేంత వరకూ ఎలాంటి వదంతులు సృష్టించవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సీజే రాయ్‌పై పన్నులు ఎగవేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఐటీశాఖ అధికారులు ఆ కంపెనీపై దాడులు చేశారు. సుమారు గంటకుపైగానే సీజే రాయ్‌ను విచారించారు.  ఆ తర్వాత కాసేపటికే ఆయన తుపాకీతో కాల్చుకున్నారు. కంపెనీ సిబ్బంది హుటాహుటిన హెచ్‌ఎ్‌సఆర్‌ లే అవుట్‌లోని నారాయణ ఆసుపత్రి తరలించినా, అప్పటికే ఆయన చనిపోయారు. 2025 ఫోర్బ్స్‌ ప్రకటించిన వందమంది అత్యంత ధనిక వ్యాపారవేత్తలలో రాయ్‌ ఒకరు.
57 ఏళ్ల సీజే రాయ్ 2005లో కాన్ఫిడెంట్ గ్రూప్‌ను ప్రారంభించి కీలకమైన రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో వందలాది ప్రాజెక్టులు చేపట్టారు. యూఏఈలో కూడా వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో పాటూ మౌలిక సదుపాయాలు, ఆతిథ్యం, విద్య, విమానయానం, రిటైల్, వినోదం, అంతర్జాతీయ వాణిజ్య విస్తరణలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.