గజనీ మహమ్మద్‌ను భారతీయ దోపిడీదారుడిగా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభివర్ణించడంపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ (మద్దతుదారులు) విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని విమర్శించింది. హిందూ వ్యతిరేక నిరంకుశ శక్తులను కీర్తిస్తుందని ఆరోపించింది. విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారుల పట్ల హమీద్ అన్సారీకి ఉన్న అభిమానం అతని సిక్ మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తుందని విరుచుకుపడింది.
చరిత్ర పుస్తకాలలో విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారులుగా చిత్రీకరించిన గజనీ మహమ్మద్ సహా చాలా మంది వాస్తవానికి భారతీయలేనని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. “విదేశీ ఆక్రమణదారులుగా మన చరిత్ర పుస్తకాలు చిత్రీకరించే లోడీ, గజనీ ఎవరో అనే విషయం నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. వారందరూ భారతీయ దోపిడీదారులు. వారు పొరుగు దేశం నుంచి భారత్‌కు రాలేదు” అని స్పష్టం చేశారు.
పైగా, మనం రాజకీయంగా వారు భారత్‌లో దేవాలయాలను, ఇతర కట్టడాలను నాశనం చేశారని చెప్పడం సౌకర్యంగా ఉంటుందని కూడా ఎద్దేవా చేయడంపై పెను దుమారం చెలరేగింది. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజినీ మహమ్మద్‌ను పొగుడుతూ హమీద్ అన్సారీ వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హిందూ ద్వేషులను ప్రశంసిస్తూ, వారి దురాగతాలను కప్పిపుచ్చుతుందని ఆరోపించారు. ఔరంగజేబు నేరాలను, హిందువులపై ఆకృత్యాలకు పాల్పడిన వారి దురాగతాలను కప్పిపుచ్చుతోందని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో అన్సారీ చేసిన వ్యాఖ్యల వీడియో ఫుటేజీని షెహజాద్ పూనావాలా షేర్ చేశారు
“కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ ఎప్పుడూ హిందూ వ్యతిరేకులను పొగుడుతుంది. హిందువులపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారిని కాంగ్రెస్ ఎప్పుడూ నిర్దోషులుగా చిత్రీకరిస్తుంది. ఇప్పుడు హమీద్ అన్సారీ మహమ్మద్ గజనీని క్రూరుడు కాదని అంటున్నారు. గజనీని భారతీయుడిగా అభివర్ణిస్తున్నారు” అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
“గజనీ భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నప్పటికీ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్, యాకూబ్, అఫ్జల్ వంటి హిందూ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తోంది. ఇది వారి మనసులో ఉన్న హిందూ ద్వేషాన్ని చూపిస్తుంది” అని షెహజాద్ పూనావాలా ధ్వజమెత్తారు.
అలాగే అన్సారీ వ్యాఖ్యలను మరో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి సైతం తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీని ఆధునిక భారతదేశ ముస్లిం లీగ్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్, దాని మద్దతుదారులు విదేశీ ఆక్రమణదారులను ఆరాధిస్తారని మండిపడ్డారు. ఔరంగజేబు, బాబర్ వంటి హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తారని విమర్శించారు.
భారతదేశాన్ని దోచుకుని దేవాలయాలను ధ్వంసం చేసిన వారికి క్లీన్‌చీట్ ఇస్తారని ఎద్దేవా చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయడం విచారకరమని పేర్కొన్నారు. వాస్తవానికి మొఘల్ చక్రవర్తులందరూ బాగ్దాద్ ఉపన్యాసం చదివి దేశాన్ని పాలించారని పేర్కొన్నారు. బ్రిటిష్ వైస్రాయ్‌లు ఇంగ్లాండ్ రాజు తరపున పాలించినట్లే, మొఘల్ చక్రవర్తులందరూ బాగ్దాద్ ఖలీఫా ప్రతినిధులుగా పాలించారని వెల్లడించారు.
మరోవైపు, గజినీ మహమ్మద్ గురించి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకత్వం, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏకీభవిస్తున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ప్రశ్నించారు. హిందూ దేవాలయాలను కూల్చివేసి, వేలాది మందిని హత్య చేసిన మహమ్మద్ గజనీ క్రూరమైన దాడులను కాంగ్రెస్ వైట్‌వాష్‌గా మారుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు తనను షాకింగ్‌గా అనిపించాయన్నారు.

More Stories
బ్రిక్స్ దేశాలను డిజిటల్ కరెన్సీలతో అనుసంధానం.. భారత్ యత్నం
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఈడీ
రివాల్వర్‌తో కాల్చుకుని కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ ఆత్మహత్య