రుతుక్రమ ఆరోగ్య హక్కు కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు బయోడిగ్రేడబుల్ మెన్స్ట్రువల్ శానిటరీ పాడ్స్‌ను ఉచితంగా అందించాలని అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల(యుటి)ను ఆదేశించింది. రాష్ట్రాలు, యుటిలు విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యాలను కల్పించాలని జస్టిస్ జె.బి.పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా లేదా నియంత్రణలో ఉన్నాయా అన్న అంశంతో సంబంధం లేకుండా అన్ని పాఠశాలలు విభిన్న ప్రతిభావంతులకు సౌకర్యవంతమైన టాయిలెట్స్ ఉండేలా చూడాలని ఆదేశించింది. ”రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కింద రుతుక్రమ ఆరోగ్యం కూడా జీవించే హక్కుతో సమానం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక టాయిలెట్లు తప్పక ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
“సురక్షితమైన, ప్రభావవంతమైన, సరసమైన రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణ పద్ధతులను అందుబాటులో ఉంచడం ఒక బాలిక అత్యున్నత స్థాయి లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జీవితానికి ఉన్న హక్కు, లైంగిక ఆరోగ్యం గురించిన విద్య, సమాచారాన్ని పొందే హక్కును కూడా కలిగి ఉంటుంది” అని కోర్టు పేర్కొంది.
“సమానత్వ హక్కు అనేది సమాన ప్రాతిపదికన పాల్గొనే హక్కు ద్వారా వ్యక్తమవుతుంది. అదే సమయంలో, అవకాశాల సమానత్వం అంటే ప్రయోజనాలను పొందడానికి అవసరమైన నైపుణ్యాలను సంపాదించడానికి ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం ఉండాలి” అని కోర్టు అభిప్రాయపడింది. బాలికలు, బాలురకు విడివిడిగా టాయిలెట్లు ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రైవేటు పాఠశాలలు వీటిని అందించడంలో విఫలమైతే వాటి గుర్తింపును రద్దు చేయాలని న్యాయస్థానం వెల్లడించింది.
బాలికలకు టాయిలెట్స్, ఉచిత శానిటరీ ప్యాడ్లను అందించడంలో ప్రభుత్వాలు విఫలమైత వాటిని కూడా జవాబుదారీగా చేస్తామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. 2024 డిసెంబర్ 10న జయఠాకూర్ దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ-ఆధారిత పాఠశాలల్లో 6నుండి 12వ తరగతి విద్యార్థినులకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ ఫర్ స్కూల్ గోయింగ్ గర్ల్స్’ దేశవ్యాప్తంగా అమలు చేయాలని పిల్లో కోరారు. ఈ పిల్‌పై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించింది.

More Stories
‘నిఫా’ వ్యాప్తి చెందే అవకాశం తక్కువే
ఢిల్లీ స్వాట్ కమాండో గర్భిణీ కాజల్ చౌదరిని చంపిన భర్త
పగలు జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం!