పగలు జంక్‌ ఫుడ్‌ ప్రకటనలపై నిషేధం!

పగలు జంక్‌ ఫుడ్‌ ప్రకటనలపై నిషేధం!

ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో జంక్‌ ఫుడ్‌ ప్రకటనలపై నిషేధం విధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక సర్వే సూచించింది. జంక్‌ ఫుడ్‌ ఉత్పత్తులపై అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఎంత వినియోగించారో హెచ్చరించేలా న్యూట్రిషన్‌ లేబుల్‌ను ముద్రించాలని సర్వే సూచించింది. 

అలాగే చిన్నారులు, పసిపిల్లల పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్‌పైనా ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో అత్యంత ప్రాసెస్‌ చేసిన ఆహార వినియోగాన్ని తగ్గించే అంశాలపై ప్రస్తావించారు. 

జంక్‌ఫుడ్‌గా పిలిచే బర్గర్‌, నూడుల్స్‌, పిజ్జా, సాఫ్ట్‌ డ్రింక్‌ వంటి పదార్థాల కారణంగా దీర్ఘకాల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. మన దేశంలో 2009 నుంచి 2023 మధ్య జంక్‌ ఫుడ్‌ వినియోగం 150 శాతానికి పైగా పెరిగిన్నట్లు సర్వే తెలిపింది. 

“అత్యంత ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల రిటైల్‌ విక్రయాలు విలువ 2006 లో 0.9 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2019 నాటికి అది 38 బిలియన్‌ డాలర్లకు (40 రెట్లు) పెరిగింది. మహిళలు, పురుషుల్లో ఒబెసిటీ సమస్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఆహార వ్యవస్థలకు సంబంధించి పాలనపరమైన విధానాల్లోనూ మార్పులు రావాలి. జంక్‌ ఫుడ్‌ ఉత్పత్తి, మార్కెటింగ్‌ను నియంత్రించాలి” అని ఆర్థిక సర్వే పేర్కొంది.