గరిష్ట స్థాయికి చేరి ఒకేసారి పడిపోయిన బంగారం, వెండి ధరలు

గరిష్ట స్థాయికి చేరి ఒకేసారి పడిపోయిన బంగారం, వెండి ధరలు

* 2025లో 11 శాతం తగ్గిన డిమాండ్‌

గత కొన్ని రోజులుగా అంచనాలకు మించి పెరిగిన బంగారం ధరలుశుక్రవారం  ఒక్కసారిగా ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపట్లోనే భారీ స్థాయిలో తగ్గాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.8 వేల మేర, వెండి ధర రూ.15 వేల మేర తగ్గింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధర ఒక్కసారిగా తగ్గిందన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.8,230 మేర తగ్గి రూ.1,70,620కు చేరింది.

22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.7550 మేర తగ్గి రూ.1,56,400కు చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.4,15,000గా ఉంది. నిన్నటి రేటుతో పోలిస్తే ఇది రూ.10 వేలు తక్కువ. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 70 శాతం మేర పెరిగాయి. స్థూలంగా చూస్తే ఈ ఏడాది బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

న్యూఢిల్లీలో గురువారం పదిగ్రాముల బంగారం ధర రూ.12 వేలు లేదా 7 శాతం ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1.83 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.71 లక్షలుగా ఉన్నది. బంగారంతోపాటు వెండి వెలుగులు జిమ్ముతున్నది. కిలో వెండి ఏకంగా రూ.4 లక్షలను అధిగమించింది.  అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ నెలకొనడం, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన గోల్డ్‌, సిల్వర్‌ వైపు మళ్లించడం ధరలు పుంజుకోవడానికి కారణమని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. 
గ్లోబల్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 177.14 డాలర్లు ఎగబాకి 5,595.02 డాలర్లకు చేరుకోగా వెండి 3.59 శాతం అందుకొని 120.45 డాలర్లకు చేరుకున్నది.  ఫ్యూచర్‌ ట్రేడింగ్‌లో కిలో వెండి ధర 4 లక్షల రూపాయలు దాటగా, 10 గ్రాముల బంగారం ధర రూ. 1.80 లక్షలుగా నమోదైంది. రూ. 22.90 వేల వృద్ధితో వెండి కిలో ధర రూ. 4.07 లక్షలకు  చేరింది. కొనుగోలుదారుల డిమాండ్‌ కారణంగా రూ. 14,586 పెరిగి, 10గ్రాముల బంగారం ధర రూ. 1.80,501తో నూతన గరిష్టాన్ని నమోదు చేసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఫ్యూచర్స్ తొలిసారి ఔన్స్‌కు 5,600 డాలర్ల మార్క్‌ను అధిగమించాయి. పారిశ్రామిక డిమాండ్ పెరగటంతోపాటు అమెరికా డాలర్ బలహీనపడటమే వెండి ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్లో 10 గ్రాములు బంగారం(24 క్యారెట్ల) ధర రూ. 1,73,300 పెరిగింది. కొన్ని గంటల వ్యవధిలోనే రూ.12 వేలు పెరిగింది. కిలో వెండి ధర రూ. 3,79, 700 వద్ద ముగిస్తే, గురువారం ఏకంగా రూ.21 వేలకు పైగా పెరిగింది. 

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్లో మార్చి డెలివరీ కాంట్రాక్టులో ప్యూచర్స్లో వెండి ధర నేడు ఒక్కరోజే రూ. 22,090 పెరిగి, రూ.4,07,456 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి డెలివరీ కాంట్రాక్టుకు బంగారం ప్యూచర్స్ పది గ్రాముల ధర కూడా రూ.14,586 పెరిగి, రూ.1,80,501కి చేరింది.  ఔన్సు వెండి ధర మొదటిసారిగా 5,600 డాలర్ల మార్కును దాటేసింది. కమొడిటీ ఎక్స్ఛేంజీలో ఏప్రిల్ డెలివరీకి ఔన్సు ధర 5,626.8 డాలర్లు ఉంది. ఔన్లు వెండి ధర 119.51 డాలర్లకు చేరువైంది. 

అమెరికా డాలర్ విలువ పడిపోవడంతో వెండి ధర పెరిగిపోతోంది. గత వారాంతం ట్రంప్ గ్రీన్ ల్యాండ్ విషయంలో సైనికచర్యను తోసిపుచ్చడం, బోర్డు అఫ్ పీస్ అంటూ శాంతి మంత్రాన్ని పఠించడంతో ఒకింత బంగారం శాంతిస్తుందనే సంకేతాలు కనిపించాయి.  అయితే, మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాల మోహరింపు, ఇరాన్ కూడా అదే రీతిలో కౌంటర్ ఇవ్వడం, అతికీలకమైన హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ బలమైన పట్టు నేపథ్యంలో అనిశ్చితి అలానే కొనసాగుతుంది. అమెరికన్ నౌకలు ఇరాన్ ని సమీపించడం, ఇజ్రాయెల్ ప్రకటనలు, దానికి ఇరాన్ కౌంటర్లు వెరసి బంగారం ధర గరిష్టంకు చేరుకుంది.

కాగా, 2025లో దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్‌ 11 శాతం తగ్గి 700 టన్నులకు పడిపోయినట్టు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరలతోపాటు కొనుగోలుదారులు వెనుకంజ వేయడం కూడా డిమాండ్‌ తగ్గడానికి ప్రధాన కారణాలని విశ్లేషించింది.  మొత్తంమీద గతేడాది గోల్డ్‌ డిమాండ్‌ 11 శాతం తగ్గి 710.9 టన్నులకు తగ్గగా 2026లో 600 నుంచి 700 టన్నుల మధ్యలో నమోదుకానున్నట్టు ముందస్తు అంచనాను విడుదల చేసింది.

2024లో మాత్రం 802.8 టన్నుల గోల్డ్‌ అమ్మకాలు జరిగింది. విలువ పరంగా చూస్తే 2025లో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవడంతో వీటి విలువ 30 శాతం ఎగబాకి రూ.7,51,490 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.5,75,930 కోట్లుగా ఉన్నది.