పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు

పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు

కల్తీ నెయ్యి కేసులో సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని సిగ్గు లేకుండా వైసిపి నేతలు చెప్పుకొంటున్నారని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు  మండిపడ్డారు. కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని  చెబుతూ పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్ట దిగజార్చారని ధ్వజమెత్తారు. గత పాలకమండలిలో అనేక అవకతవకలు జరిగాయని, నిబంధనలు ఏమాత్రం పాటించలేదని ఆయన ఆరోపించారు. 

ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ఒకరిద్దరికి లాభం చేకూర్చడం కోసం నిబంధనలు మార్చారని, సామర్థ్యం లేని డెయిరీకి 60 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్‌ ఇచ్చి రూ.250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.  చుక్క పాలు లేకుండానే లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని బీఆర్‌ నాయుడు ప్రశ్నించారు. 

ప్రాణాంతకమైన కెమికల్స్‌తో నెయ్యి తయారు చేశారని చెబుతూ గత పాలకులు చేసింది మహా పాపమని ఆయన స్పష్టం చేశారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని, నెయ్యిలో యానిమల్‌ ఫ్యాట్‌ ఉందని ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందని, సిట్‌ నివేదికలో కూడా ఇదే ఉందని స్పష్టం చేశారు.  గత పాలకమండలి చేసిన ఒత్తిళ్లకు సంబంధించిన ఈ-మెయిళ్లు కూడా సిట్‌ నివేదికలో పెట్టారని తెలిపారు.

తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని నాయుడు డిమాండ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు సీబీఐకి బ్యాంక్‌ ఖాతాలు ఇచ్చేందుకు నిరాకరించారని పేర్కొంటూ  కల్తీ నెయ్యి అంటే ఒకరకంగా స్లో పాయిజన్ అని చెప్పారు.  కాసుల కోసం కక్కుర్తి పడి భోలే బాబా డెయిరీని ఎంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. తనిఖీల్లో భోలేబాబా డెయిరీకి ఒక్క ఆవు కూడా లేదని తేల్చారని తెలిపారు.

చినప్పన్న ఎవరు? వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదా? అని నిలదీశారు. అన్య మతస్తులు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూశారని పేర్కొంటూ వైసీపీ పెద్దల సహకారం లేకుండా ఇదంతా ఎలా చేస్తారని అడిగారు.  హిందూ సమాజానికి జగన్‌ క్షమాపణలు చెప్పాలని నాయుడు  డిమాండ్ చేశారు. తప్పులు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే సరిపోతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.