ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మ బీఆర్ఎస్​ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు సిట్​ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్​ నందినగర్​లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  65 ఏళ్ల వయసు దృష్ట్యావిచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని, మీరు కోరిన చోటే విచారిస్తామని కేసీఆర్‌కు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కేటీఆర్​, హరీశ్​రావు, సంతోశ్​ రావులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించిన విషయం విధితమే.  తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా, ప్రభాకర్ రావును సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది.
ఈ కేసులో చిన్న చిన్న గ్యాప్స్​ను కూడా ఫిల్‌ చేస్తూ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముందుకు వెళ్తోంది.  ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ కస్టోడియల్ విచారణ ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే ట్యాపింగ్ బాధితులుగా ఉన్న మొత్తం 618 మందిని దాదాపు అందరి స్టేట్మెంట్​ను రికార్డ్ చేసిన సిట్ అధికారులు, ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ తర్వాత మరికొంతమందిని పిలిచి విచారిస్తున్నారు.
 
మరోవైపు కేసీఆర్ విచారణకు సంబంధించి సిట్ కార్యాలయంలో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో అడగాల్సిన ప్రశ్నల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్​ను ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.
 
పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్లు, విరాళాలు సమకూర్చిన వారిలో పలువురు వ్యాపారుల మొబైల్స్​ నిఘాలో ఉన్నట్లుగా సిట్​కు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలిసింది. ఆయా ఫోన్​ నెంబర్లతో ఉన్న జాబితాను కేటీఆర్​ ముందు ఉంచి విచారించినట్లు సమాచారం.