ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ భావనను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఇటీవల తీసుకొచ్చిన నూతన నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొత్త నిబంధనలపై అత్యున్నత ధర్మానసం స్టే విధించింది. నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, దుర్వినియోగానికి అవకాశం ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం, యూజీసీలకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండవని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త నిబంధనలను నిలిపివేయాలని యూజీసీ, కేంద్రాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. యూజీసీ నోటిఫై చేసిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం) నిబంధనలు–2026 సమాజాన్ని విభజించేలా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
“మేము జోక్యం చేసుకోకపోతే ఇది ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుంది. సమాజాన్ని చీల్చే ప్రభావం చూపిస్తుంది” అని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ నెల 13న యూజీసీ ఈ కొత్త నిబంధనలను ప్రకటించింది. వీటి ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ఈక్విటీ కమిటీలు, ఈక్వల్ అపార్చునిటీ సెంటర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి.
వివక్షపై ఫిర్యాదులను పరిశీలించడం, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం ఈ కమిటీల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నాయి. ఈ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని నిబంధనలు పేర్కొన్నాయి. అయితే, ఈ నిబంధనల్లోని కొన్ని అంశాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఫిర్యాదు చేసే హక్కు లేకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ కారణంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, దుర్వినియోగానికి అవకాశం ఉందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. నిపుణులు వీటిని పునఃపరిశీలించి మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కోర్టు మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది.
నిబంధనల్లోని సెక్షన్ 3(సి) ప్రకారం కుల వివక్షను కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై జరిగే వివక్షగానే నిర్వచించడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. అదే సమయంలో సెక్షన్ 3(ఈ)లో వివక్షను మతం, జాతి, లింగం, పుట్టిన ప్రదేశం, కులం వంటి అన్ని అంశాల ఆధారంగా నిర్వచించారని గుర్తించింది. పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాదులు, నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని పేర్కొన్నారు.
పౌరులు అందరికీ సమాన రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రానిదని, కానీ ఈ నిబంధనలు సాధారణ వర్గాలను పూర్తిగా పక్కనపెట్టాయని వాదించారు. ఇది సమానత్వం కంటే విభజనకు దారి తీస్తుందని తెలిపారు. విచారణ సందర్భంగా జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛాయుత, సమాన వాతావరణం ఉండాలి. కానీ ఈ నిబంధనలు వెనుకడుగు వేసినట్లుగా కనిపిస్తున్నాయి” తెలిపారు. అలాగే 2026 నిబంధనల్లో రాగింగ్ అంశాన్ని ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు.
మరోవైపు, 2019లో రోహిత్ వేముల, పాయల్ తడ్వి తల్లులు దాఖలు చేసిన పిల్ ఆధారంగానే నిబంధనలు రూపొందాయని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. కుల వివక్షను పూర్తిగా నిర్మూలించాలన్న రాజ్యాంగ లక్ష్యంతోనే ఈ నిబంధనలు వచ్చాయని ఆమె వాదించారు. అయితే, అన్ని వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు 2026 యూజీసీ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తూ, అంతవరకు 2012లో ఉన్న పాత నిబంధనలు అమల్లో కొనసాగుతాయని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ మార్చి 19న జరగనుంది.

More Stories
6.8 నుంచి 7.2 శాతం మధ్య జీడీపీ వృద్ధి
అశ్రునయనాల మధ్య అజిత్ పవార్ అంత్యక్రియలు
ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచికం