అజిత్‌ పవార్‌ మరణంలో కుట్ర లేదు

అజిత్‌ పవార్‌ మరణంలో కుట్ర లేదు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విమాన ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ స్పష్టం చేశారు. అజిత్‌ పవార్‌ ఈ ప్రమాదంలో మరణించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణంతో మహారాష్ట్రకు తీరని నష్టం జరిగిందని శరద్‌ పవార్‌ తెలిపారు. ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రోజు మనల్ని విడిచి వెళ్ళిపోయారని చెప్పారు.

మహారాష్ట్ర ఈ రోజు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఈ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం’ అని పేర్కొన్నారు. కాగా, అన్నీ మన చేతుల్లో ఉండవని అజిత్‌ పవార్‌ బాబాయ్‌ అయిన 85 ఏళ్ల శరద్‌ పవార్‌ తెలిపారు. తాను నిస్సహాయంగా ఉన్నట్లు చెప్పారు.

‘ఏడవడం సిగ్గుగా అనిపించవచ్చు. కొన్ని సంఘటనల వెనుక రాజకీయాలు ఉండవు. ఈ విషయంలో నా వైఖరిని నేను స్పష్టంగా చెప్పా. దీనిలో ఎలాంటి కుట్ర లేదు. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే. మహారాష్ట్ర, మనమందరం ఈ బాధను జీవితాంతం భరించాల్సి ఉంటుంది. దయచేసి దీనిలోకి రాజకీయాలను తీసుకురావద్దు, నేను చెప్పదలుచుకున్నది ఇంతే’ అని ఆయన సూచించారు.

కాగా, బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఎన్సీపీ-ఎస్పీ అధినేత శరద్ పవార్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

మరోవంక, మహారాష్ట్ర విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.ప్రమాదం జరిగిన సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ తగ్గినట్లు తేలిందని తెలిపారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినప్పుడు, బారామతి విమానాశ్రయంలో వెలుతురు సరిగ్గా లేదని చెప్పారు.

బారామతిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఉదయం 8.10 గంటలకు పవార్‌ ముంబై నుంచి విమానంలో బయల్దేరారు. 8.30 గంటల సమయంలో విమానం ల్యాండ్‌ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే క్లియరెన్స్‌ కోసం బారామతి ఏటీసీ అధికారులను సంప్రదించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో విజిబులిటీ చాలా తక్కువగా ఉండటంతో.. ‘రన్‌వే కనిపిస్తుందా? లేదా??’ అని పైలట్లను బారామతి ఏటీసీ అధికారులు అడిగారు.

దీంతో క్లియరెన్స్‌ రాలేదని, ఈ క్రమంలో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్టు మంత్రి వివరించారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో రన్‌వే కనిపిస్తుందా? అని ఏటీసీ అధికారుల ప్రశ్నకు పైలట్లు సానుకూలంగా స్పందించడంతో క్లియరెన్స్‌ ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 8.42 గంటల సమయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నించగా  విజిబులిటీ సమస్యలతోపాటు నియంత్రణ కోల్పోవడంతో రన్‌వేకు దగ్గరగా ఉన్న ఓ బండరాయికి ఢీకొని 8.48గంటల ప్రాంతంలో పెద్ద మంటతో విమానం కూలిపోయినట్టు సమాచారం.

రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు గో ఎరౌండ్‌ పాటించారని, ఈ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నట్టు తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్‌ రాలేదని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతైన విచారణ చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వాస్తవాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు.