శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాలో బడా కుట్ర

శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాలో బడా కుట్ర

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో వైఎస్సార్సీపీ హయాంలో బడా కుట్ర జరిగినట్టు ఏడాదిపాటు దర్యాప్తు జరిపిన సీబీఐ సిట్‌ తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకూ ఎక్కడెక్కడ, ఎవరెవరు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది పసిగట్టింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డెయిరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, లాజిస్టిక్‌ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తుల నెట్‌వర్క్‌ గొలుసును పదికి పైగా రాష్ట్రాల పరిధిలో వెలికి తీసింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, రాష్ట్ర పోలీసు అధికారులతో ఏర్పడిన ‘సిట్‌’ తన దర్యాప్తులో తేల్చిన అంశాలపై తుది చార్జిషీట్‌ను ఈనెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించిన సంగతి తెలిసిందే. 2019-24 మధ్య టీటీడీకి సరఫరా అయిన నెయ్యి నమూనాల్లో నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లు గుజరాత్‌లోని ఎన్​డీడీబీ-కాఫ్ ప్రయోగశాల విశ్లేషణలో తేలిందని సిట్ వెల్లడించింది.

‘భగవాన్‌పూర్‌లోని భోలేబాబా ఓరోగానిక్ డెయిరీ మిల్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 2019 నుంచి 2024 వరకూ రూ.68 లక్షల 17 వేల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ తెలిపింది. అందులో రూ.59 లక్షల 71 కిలోలను అగ్‌మార్క్‌ స్పెషల్‌ గ్రేడ్‌ ఆవు నెయ్యి ముసుగులో టీటీడీకి సరఫరా చేశారని పేర్కొంది. తద్వారా రూ.234 కోట్ల 51 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది.

భోలేబాబా డెయిరీ ప్రతినిధులు, నిందితులైన పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లు కల్తీ నెయ్యి తయారీ కోసం తమ అనుబంధ సంస్థలైన హర్షా ట్రేడింగ్‌ కంపెనీ, హర్షా ఫ్రెష్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా కల్తీ నెయ్యి తయారీ కోసం కోల్‌కతాలోని బుడ్జే బుడ్జే రిఫైనరీస్‌ లిమిటెడ్, ఇతర సంస్థల నుంచి పామ్‌ కెర్నెల్‌ ఆయిల్, రిఫైన్డ్‌ పామాయిల్, రిఫైన్డ్‌ పామోలిన్‌ ఆయిల్‌ కొన్నారు. 

అరిస్టో కెమికల్స్‌ నుంచి లాక్టిక్‌ యాసిడ్‌, సుగంధ్‌ ఆయిల్స్‌ అండ్‌ కెమికల్స్, శివాన్షి ట్రేడింగ్‌ కంపెనీ, జీఆర్‌ ఇంప్లెక్స్‌ నుంచి ఎసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్, మోనోగ్లిసరైడ్స్‌ వంటి రసాయనాలు సేకరించారు. పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌ వారి ఉద్యోగులైన మోహన్‌ రాణా, సంజయ్‌ చౌహాన్‌ , ఆశిష్‌ రోహిలాలతో కలిసి కల్తీ నెయ్యి తయారు చేశారు.  పాలు, వెన్న వంటివి సేకరించకుండా పామాయిల్, పామ్‌ కెర్నెల్‌ ఆయిల్, పామాలిన్‌ ఆయిల్‌ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి ఈ కల్తీ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్‌ పరీక్ష విలువ సర్దుబాటు, నెయ్యి వాసనలు వచ్చేందుకు ఈ రసాయనాలు కలిపారు.

గుజరాత్‌లోని ఎన్​డీడీ కాఫ్, ఆనంద్‌ సంస్థ 2025 మార్చి 27న ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. టీటీడీ సేకరించిన నెయ్యి నమూనాల్లో ప్రధానంగా పామాయిల్, పామ్‌ కెర్నెల్‌ ఆయిల్‌ ఉందని, బుట్యరిక్‌ యాసిడ్‌ నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువగా ఉందని పేర్కొంది. కొవ్వులు కనిపించలేదని, అందువల్ల జంతువుల కొవ్వు ఉండే అవకాశాలు చాలా తక్కువని వివరించింది. 

హర్షా ఫ్రెష్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్, భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ ప్రైవేట్‌ సంస్థలకు టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హతే లేదని, నకిలీ పత్రాలతో టీటీడీ టెండర్లలో పాల్గొన్నట్లు అభియోగపత్రంలో స్పష్టం చేసింది. నాటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి పీఏ హోదాలో ఉన్న చిన్నప్పన్న టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ల విషయంలో కీలకంగా వ్యవహరించారని అభియోగపత్రంలో సిట్‌ వెల్లడించింది.

కిలో నెయ్యికి రూ.25 చొప్పున లంచం తీసుకున్నారని పేర్కొంది. పొమిల్‌ జైన్‌ అలా చెల్లించటానికి నిరాకరించగా నాటి టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జీఎం సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్‌ తనిఖీ సమయంలో భోలేబాబా డెయిరీపై అనర్హత వేటేయించారని సిట్‌ వెల్లడించింది. 2022 ఏప్రిల్‌, మే నెలల్లో సుబ్రహ్మణ్యం నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేవారి వివరాలను చిన్నప్పన్న ముందే తీసుకున్నారని తెలిపింది.

కొనుగోళ్ల వ్యవహారాలు టీటీడీ బోర్డు నిర్ణయాలకన్నా ముందే సుబ్రహ్మణ్యం నుంచి చిన్నప్పన్న మెయిల్‌కు వెళ్లేవని వివరించింది. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌కు 35 శాతం సరఫరా ఆర్డర్లు అధిక ధరలకు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్‌మోహన్‌ గుప్తా నుంచి చిన్నప్పన్న రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని సిట్‌ వెల్లడించింది. టీటీడీ అధికారులు సుబ్రహ్మణ్యం, నటేష్‌బాబు, అనిల్‌కుమార్, ఈశ్వర్‌రెడ్డి,సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ నివేదికల్లో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు తేలినా ఆ నివేదికలు ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టారని స్పష్టం చేసింది.