అశ్రునయనాల మధ్య అజిత్ పవార్​ అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య అజిత్ పవార్​ అంత్యక్రియలు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్‌లో అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. గురువారం ఉదయం ప్రారంభమైన అంతిమ యాత్రలో వేల మంది అభిమానులు పాల్గొన్నారు.  కుటుంబసభ్యులు ,కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్‌ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, శరద్ పవార్, సుప్రియా సూలే, బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్, నారా లోకేష్ సహా అన్ని పార్టీల నేతలూ  అంతక్రియల్లో పాల్గొన్నారు.

అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్. కుమారులు పార్థ్, జయ అంత్యక్రియల సమయంలో అక్కడే ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని మైదానానికి తీసుకువస్తున్నప్పుడు మద్దతుదారులు “అజిత్ దాదా అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఉదయం, వందలాది మంది సంతాపకులు తమ స్వగ్రామంలోని అజిత్ పవార్ నివాసమైన కాటేవాడికి తరలివచ్చి ఆయనకు చివరి నివాళులర్పించారు.

నిన్న బారామతి విమానాశ్రయం దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ (66) మరణించారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి పుణ్యశ్లోక అహిల్యాదేవి ఆస్పత్రి నుంచ కాటేవాడి‌లోని ఇంటికి తరలించారు.  ఇవాళ ఉదయం 9 గంటలకు విద్యా ప్రతిష్ఠాన్ క్యాంపస్ నుంచి అంతిమ యాత్ర మొదలైంది.

పూలతో అలంకరించిన రథంలో మృతదేహాన్ని తీసుకెళ్లారు. నగరంలోని ప్రధాన రోడ్ల గుండా ఈ యాత్ర సాగింది. “అజిత్ దాదా అమర్ రహే” అంటూ అభిమానులు నినాదాలు చేశారు. తర్వాత మృతదేహాన్ని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్‌కు చేర్చారు. అక్కడ రాష్ట్ర లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. అజిత్ పవార్ కుమారులు చివరి క్రియలు నిర్వహించారు.